ప్రధానమంత్రి నరేంద్రమోదీ “మన్ కీ బాత్” కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన ఆపరేషన్ సిందూర్పై వివరించారు. ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాకుండా, భారతదేశ ప్రజల సంకల్పాన్ని, సైనికుల ధైర్యాన్ని ప్రతిబింబించే ఒక చరిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు.

భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో చూపిన పరాక్రమం, దేశ ప్రజల గర్వానికి కారణమైందన్నారు. ఈ విజయంతో దేశమంతటా దేశభక్తి జ్వాలలు ఎగసిపడ్డాయని, పల్లెల నుంచి మహానగరాల దాకా జాతీయజెండాలతో ప్రజలు సైనికులకు అభినందనలు తెలపడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ ఒక సైనిక మిషన్ కాదు – ఓ దేశ సంకల్పం
పీఎం మోదీ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంగా మనం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్తంగా కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం ఒక సైనిక మిషన్ కాదని, అది మన సంకల్పం, ధైర్యానికి ప్రతీక అని, మారుతున్న భారత దేశ ముఖచిత్రమని ప్రధాన మంత్రి అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయంతో దేశమంతటా భక్తిభావం నింపిందని, జాతీయజెండాలతో సైన్యానికి అభినందనలు తెలియచేయడానికి పల్లెల నుంచి మహానగరాల వరకు కదలి వచ్చాయని చెప్పారు.
యువతలో దేశభక్తి కాంతి
ఆపరేషన్ సిందూర్ తో యువతలో దేశభక్తి ఆపరేషన్ సిందూర్ విజయం ప్రజలను ఎంతో ప్రభావితం చేసిందని, సైన్యంలో వాలంటీర్లుగా చేరేందుకు ఎందరో యువకులు ముందుకు వచ్చారని అన్నారు. ఇక మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధం గురించి మాట్లాడిన ప్రధాని మోదీ మావోయిస్టుల ప్రభావంతో చాలా గ్రామాలు బస్సు సదుపాయానికి దూరంగా ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ప్రధాన మంత్రి చెప్పారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా సమర్థ పోరాటం
ఉగ్రవాదం మాత్రమే కాకుండా అందుబాటులో లేని ప్రాథమిక వనరులు ఉన్న మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కాటేఝరి గ్రామాన్ని ఉదహరించారు. అ ఊరికి మొదటిసారిగా చేరుకున్న బస్సుకు స్థానికులు డప్పులతో స్వాగతం పలికారని చెప్పారు. బస్సు రాకతో తమ జీవితం సుఖవంతంగా సాగుతుందని గ్రామస్తులు చెబుతున్నారని అన్నారు.
డ్రోన్ దీదీలు: గ్రామీణ వ్యవసాయంలో సాంకేతిక విప్లవం
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డికి చెందిన మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా వ్యవసాయ రంగంలో మార్పు తీసుకొచ్చారని ప్రధాని ప్రశంసించారు. సంకల్పానికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించారని అన్నారు. ఆ మహిళలు డ్రోన్ ల సహాయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో మందుల పిచికారీ పనిని నిర్వహించారు. వారు డ్రోన్ ఆపరేటర్లుగానే కాక స్కై వారియర్స్ గా గుర్తింపు పొందారని అభినందించారు.
యోగా దినోత్సవం
జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. పదేళ్ల క్రితం 2015 జూన్ 21న ప్రారంభమైన యోగా దినోత్సవం ఎంతో ఆదరణ పొందుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించిందని, విశాఖపట్నంలో జరిగే ‘యోగదినోత్సవం’లో పాల్గొనే అవకాశం తమకు లభిస్తోందని ప్రధాన మంత్రి వెల్లడించారు.
ఆయుర్వేదం – సాంప్రదాయానికి ఆధునికత జత
భారత ప్రాచీన ఔషధ శాస్త్రమైన ఆయుర్వేదాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తించారు. ఈ నెల 24 న దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ తులసీభాయ్ సమక్షంలో అవగాహన పత్రాలపై సంతకాలు జిరిగాయని గుర్తు చేశారు. దీంతో ఆయుష్ ప్రపంచ వ్యాప్తంగా మరింత మందికి చేరేందుకు వీలువుతుందని అన్నారు. ఇంకా ఎన్నో ఆసక్తికర అంశాలను ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావించిన అంశాలు దేశ ప్రజల్లో భరోసా, దేశభక్తి, సాంకేతిక మద్దతుతో అభివృద్ధి అనే మూడు దిశల్లో స్పష్టమైన దారిని సూచిస్తున్నాయి.
Read also: Modi: ఎన్డీఏ ముఖ్యమంత్రులతో ప్రధాని భేటి!