తమిళనాడులోని రామేశ్వరం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నెల 6న ప్రధాని మోదీ రామేశ్వరం వస్తున్న నేపథ్యంలో మండపం క్యాంప్ హెలిపాడ్‌లో మంగళవారం ఉదయం వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా రామేశ్వరం, పాంబన్ వంతెన పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
పర్యటన వివరాలు
అధికారిక సమాచారం ప్రకారం, ప్రధాని మోదీ ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మదురై విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ద్వారా మండపం క్యాంప్ సమీపంలోని హెలిపాడ్‌లో దిగుతారు. అనంతరం కారులో పాంబన్ వంతెన ప్రాంతానికి చేరుకుని, కొత్త వంతెనను పరిశీలిస్తారు. రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని మోదీ రామేశ్వరం బస్ స్టేషన్ సమీపంలోని వేదిక వద్ద నిర్వహించే ప్రత్యేక వేదికపై నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.
భద్రతా ఏర్పాట్లు
మోదీ పర్యటనను పురస్కరించుకుని సుమారు ఐదువేలమందికి పైగా పోలీసులతో రామేశ్వరం అంతటా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మోదీ తన పర్యటనలో భాగంగా పర్వతవర్థినీ సమేత రామనాధస్వామివారి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. దీంతో ఆ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే మఫ్టీలో పోలీసులు నిఘా వేస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యా కుమారి, విరుదునగర్ తదితర జిల్లాల నుండి సాయల్‌కుడి ఈస్ట్‌కో్‌స్టరోడ్డు మీదుగా రామనాథపురం, రామేశ్వరం వైపు వచ్చే అన్ని వాహానాలను సముద్రతీర భద్రతాదళం ఏఎస్పీ ఆదేశాలతో ఎస్‌ఐ పాల్‌రాజ్ ప్రత్యేక బృందం తనిఖీ చేసిన మీదటే అనుమతిస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోదీని కలుసుకునేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మదురైలో ప్రధాని మోదీతో భేటీ కోసం అపాయింట్‌మెంట్ కోరుతూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇటీవల అమిత్‌షాతో ఈపీఎస్ భేటీ తరువాత అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, సెంగోట్టయ్యన్ కూడా అమిత్‌షాతో రహస్యంగా సమావేశమయ్యారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న అంతర్గత విభేదాలను మరచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా తదుపరి చర్యలు తీసుకోమంటూ సెంగోటయ్యన్‌కు అమిత్‌షా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులలోనే ప్రధాని మోదీతో భేటి అయ్యేందుకు ఈపీఎస్ అప్పాయింట్‌మెంట్ కోరినట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.భద్రతా కారణాల వల్ల అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఇక మోదీ-ఈపీఎస్ భేటీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ భేటీ తమిళనాడు రాజకీయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది వేచిచూడాలి.