మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ, జనవరి 5 నుంచి ‘MGNREGA బచావో అభియాన్’ పేరుతో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గ్రామీణ పేదలకు కనీస జీవనోపాధి కల్పించే ఈ చట్టం పట్ల మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఖర్గే మండిపడ్డారు. పేదలకు చట్టబద్ధంగా దక్కాల్సిన పని హక్కును కాపాడటం కోసం క్షేత్రస్థాయి నుంచి పోరాటం చేస్తామని, ఈ పథకాన్ని పరిరక్షిస్తామని CWC వేదికగా ప్రతిజ్ఞ చేశారు.
Congress CWC meeting : కాంగ్రెస్ CWC కీలక సమావేశం ఖర్గే అధ్యక్షతన హై లెవల్ చర్చలు
ఉపాధి హామీ పథకం అనేది కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఒక విప్లవాత్మక చట్టమని ఖర్గే గుర్తు చేశారు. క్లిష్ట సమయాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్న ఈ పథకం పేరు నుంచి ‘గాంధీ’ పేరును తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు మార్పు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, మహాత్మా గాంధీ భావజాలాన్ని ప్రజల నుంచి దూరం చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు. చట్టం పేరు మార్చడం ద్వారా ప్రభుత్వం తన అహంకారాన్ని చాటుకుంటోందని, ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు.

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఖర్గే హెచ్చరించారు. ఉపాధి హామీ నిధుల్లో కోత విధించడం, వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేయడం వంటి చర్యల వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ‘బచావో అభియాన్’ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తామని, పార్లమెంటు లోపల మరియు బయట ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఎండగడతామని స్పష్టం చేశారు. ఈ పోరాటం కేవలం ఒక పార్టీది మాత్రమే కాదని, దేశంలోని కోట్లాది మంది గ్రామీణ పేదల హక్కుల కోసమని ఆయన పునరుద్ఘాటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com