ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఓట్ బ్యాంక్ పైన కేజ్రీవాల్ గురి పెట్టారు. మహిళలు, యువత, అద్దెకు ఉండే వారికి హామీలు ఇచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు మధ్య తరగతి పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందు కీలక అంశాలను ప్రతిపాదించారు. పరోక్షంగా బీజేపీకి ఇరకాటంలోకి నెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో లోకు కౌంటర్ గా కేజ్రీవాల్ కొత్త గేమ్ ప్రారంభించారు. కేంద్రం ఫిబ్రవరి 1న ప్రతిపాదించే కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయింపులను పది శాతానికి పెంచాలని డిమాండ్ చేసారు. అదే విధంగా ప్రయివేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ పైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఇక, ఉన్నత విద్య చదివే వారికి రాయితీలతో పాటుగా స్కాలర్ షిప్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.

కేంద్రం ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పది శాతానికి పెంచాలని కోరారు. ఇక, ఆరోగ్య భీమా పై భారం తగ్గించేలా ప్రీమియం చెల్లింపుల పైన పన్ను రద్దు చేయాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఏడు లక్షల ఆదాయ పరిమితిని పది లక్షలకు పెంచాలని కేజ్రీవాల్ కోరారు. నిత్యవసర సరకులపై జీఎస్టీని ఎత్తివేయాలిని డిమాండ్ చేసారు. సీనియర్ సిటిజన్లకు భరోసా ఇచ్చేలా కొత్త పెన్షన్ విధానంతో పాటుగా ఆర్దిక పరంగా వెసులుబాటు కల్పించాలని కోరారు. ఇక, వీరికి దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేసారు. ఢిల్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. త్రిముఖ పోటీలో పై చేయి కోసం మూడు పార్టీలు కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకోవటం కోసం ఆప్.. ఎలాగైనా అధికారం దక్కించు కోవటం కోసం బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి.