ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యమునా నది ఒక కీలక అంశంగా మారింది, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి దాడి చేసింది. శనివారం ఉదయం బీజేపీ న్యూ ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థి పర్వేష్ వర్మ, యమునా నదిలో కేజ్రీవాల్ కటౌట్ పోస్టర్ను బోటు సహాయంతో ముంచారు. ఆ కటౌట్‌పై “మెయిన్ ఫెయిల్ హో గయా, ముఝే వోట్ మత్ దేనా, 2025 తక్ మెయిన్ యమునా సాఫ్ నై కర్ పాయా” (నేను విఫలమయ్యాను, నాకు ఓటు వేయవద్దు. 2025 నాటికి యమునాను శుభ్రం చేయలేకపోయాను) అన్న వాక్యాలతో కేజ్రీవాల్ సిగ్గుతో చెవులు పట్టుకున్నట్లు కనిపించారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత పర్వేష్ వర్మ మాట్లాడుతూ, యమునాలోని నీటిని శుభ్రం చేయడం పెద్ద సవాలేమీ కాదు. సిల్ట్‌ను తొలగించడం, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడం, యమునా రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ గారు సబర్మతి రివర్‌ఫ్రంట్‌ను ఎలా అభివృద్ధి చేసారో అలాగే యమునాను కూడా శుభ్రపరుస్తారు అని వ్యాఖ్యానించారు.
యమునా నది కాలుష్యం ఢిల్లీ ప్రజలకు ఒక క్లిష్టమైన సమస్యగా మారింది. గతంలో ఆప్ ప్రభుత్వం 2025 నాటికి యమునాను శుభ్రం చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు అని విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ఎన్నికలలో ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. 70 అసెంబ్లీ స్థానాల కోసం మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.