ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సామాన్యులను మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టేసింది. రాష్ట్రంలో ఆటో రిక్షా ఛార్జీలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఆటో డ్రైవర్లకు శుభవార్తగా నిలిచినా, నగరంలో రోజూ ప్రయాణించే సాధారణ ప్రజలకు మాత్రం బ్యాడ్ న్యూస్ గానే ఉంది.ప్రస్తుతం ఉన్న ఛార్జీల మీద ఏకంగా 20 శాతం పెంచి ఆటో డ్రైవర్ల (Auto Drivers) కు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. బస్సుల్లో ఉండే రద్దీ నేపథ్యంలో చాలా మంది క్యాబ్ కన్నా కూడా ఆటోనే బెస్ట్ అనుకుంటారు. అలాంటి వారికి ఇది భారీ షాక్ అనే చెప్పవచ్చు. కర్ణాటక ప్రభుత్వం ఆటో ఛార్జీల పెంపుకు రెడీ అయ్యింది. కొన్ని నెలలుగా దీనిపై తర్జనభర్జనలు జరుగుతుండగా, చివరకు ఆటో ఛార్జీల పెంపుకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పెరిగిన ఛార్జీలు
దీనిలో భాగంగా మొదటి 1.9 కిలోమీటర్లకు బేస్ ఛార్జీని రూ.30 నుండి రూ.36కి పెంచాలని భావిస్తుంది. ఆ తర్వాత కిలోమీటరుకు గతంలో ఉన్న రూ.15ల ఛార్జీని ఇకపై రూ.18కి పెంచాలని భావిస్తుంది. అంటే గతంలో ఉన్న ఛార్జీల మీద మొత్తంగా 20 శాతం పెంచడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. నాలుగేళ్ల తర్వాత బెంగళూరు (Bangalore) లో ఆటో ఛార్జీలు పెరగనున్నాయి. గతంలో 2021లో చివరగా ఆటో ఛార్జీలను పెంచారు. పెరిగిన ఛార్జీలు బెంగళూరులోనే అమలవుతాయని తెలిపారు.ఆటో ఛార్జీల పెంపుకు సంబంధించి జిల్లా రవాణా అథారిటీ(డీటీఏ) సమర్పించిన ఈ ప్రతిపాదనకు కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి నుండి అనుమతి లభించింది.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీన్ని ఆమోదిస్తే, పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి. త్వరలోనే దీనిపై సీఎం సంతకం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రముఖ యూనియన్లు
డీటీఏ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ వివరణాత్మక అధ్యయనం తర్వాత ఛార్జీల సవరణపై సిఫార్సు చేశారు. ఈ ప్యానెల్, ప్రయాణీకుల డిమాండ్, కార్యాచరణ సవాళ్లు, నగర ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించింది. అలానే ఈ ఏడాది మార్చి నెల ప్రారంభంలో ప్రధాన వాటాదారులతో ఛార్జీల పెంపుపై సంప్రదింపులు జరిపింది. నగరంలోని ప్రముఖ యూనియన్లు, ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ఏఆర్‌డీయూ), ఆదర్శ్ ఆటో, టాక్సీ డ్రైవర్స్ యూనియన్ (ఏఏటీడీయూ)లు ఆటోఛార్జీ (Auto Charge) లకు సంబంధించి బేస్ ధర రూ. 40 ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ. 20 పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే డీటీఏ ఇంత భారీ పెంపుకు ఆమోదం తెలపలేదు. మధ్యే మార్గంగా బేస్ ధరను రూ.36కి ఆ తర్వాత ప్రతి కిలోమీటరు రూ.18 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 16 నుండి ఇక్కడ బైక్ ట్యాక్సీలను నిషేధించిన సంగతి తెలిసిందే.
Read Also: Cab Charges: క్యాబ్ ఛార్జీల పెంపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్