ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లాలు అత్యంత అప్రమత్తతకు లోనయ్యాయి. గురువారం రాత్రి నుంచి జైసల్మేర్, బికనీర్, శ్రీగంగానగర్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో పేలుళ్లు, సైరన్‌లు ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. జైసల్మేర్‌లో గంటసేపు భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో జిల్లా మొత్తం అంధకారంలో మునిగిపోయింది. బాడ్మేడ్ రైల్వే స్టేషన్, జిల్లా కలెక్టరేట్, ప్రధాన మార్కెట్ వంటి ప్రాధాన్యత కలిగిన ప్రదేశాల్లో సైరన్లు మోగుతూ అలర్ట్ ఇచ్చాయి.
ఇంట్లోనే ఉండాలని అధికారుల సూచనలు
శ్రీగంగానగర్‌లో అధికారులు ప్రజలను ఇంట్లోనే ఉండాలని, లైట్లు ఆపివేయాలని సూచించారు. పబ్లిక్ ఆందోళన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ మోడ్‌లోకి వెళ్లి పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేశారు. ప్రజల రక్షణ కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. బికనీర్ జిల్లాలో పూర్తిగా బ్లాక్‌అవుట్ అమలు చేయగా, జిల్లా మేజిస్ట్రేట్ నమ్రతా వృష్ణి తదుపరి ఆదేశాల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.
పేలుళ్ల శబ్దాలు, సైరన్‌లతో వణికిపోతున్న ప్రజలు
జోధ్‌పూర్, జైసల్మేర్ నగరాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు, సైరన్‌లు వినిపించడంతో ప్రజల్లో మరింత భయాందోళనలు పెరిగాయి. ముఖ్యంగా జైసల్మేర్ – పోఖ్రాన్ ప్రాంతాల్లో డ్రోన్ కార్యకలాపాలు సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న ముప్పులను దృష్టిలో ఉంచుకుని భారత సరిహద్దు రాష్ట్రాలు పూర్తి అప్రమత్తతతో రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి.
Read Also : Pakistan : జమ్ముకశ్మీర్ ను టార్గెట్ చేసిన పాక్