కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో (In Hassan district) గుండెపోటు మరణాలు (Heart attack deaths) తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత 40 రోజుల వ్యవధిలో జిల్లాలో 24 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇది సాధారణ పరిస్థితి కాదని ప్రజల్లో భయం మొదలైంది.తాజాగా మంగళవారం సంజయ్ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. హొళెనరసీపుర తాలూకా సోమనహళ్లికి చెందిన సంజయ్ తన మిత్రులతో పార్టీకి వెళ్లిన సమయంలో బీపీ అధికంగా రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఛాతిలో నొప్పి రావడంతో మిత్రులు స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు వెల్లడించారు.
బీపీ, డయాబెటిస్ ప్రధాన కారణాలుగా వైద్యుల వ్యాఖ్యలు
జయదేవ ఆసుపత్రి మాజీ డైరెక్టర్, ఎంపీ మంజునాథ్ మాట్లాడుతూ, అధిక రక్తపోటు (బీపీ) గుండెపోటుకి ప్రధాన కారణమని తెలిపారు. అలాగే మధుమేహం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి వంటి అంశాలూ ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ఏ ఒక్క అనుమానమైనా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు.ఇలా వరుసగా హఠాన్మరణాలు చోటు చేసుకోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు. హసన్ జిల్లాలో గుండెపోటు మరణాల వెనక కారణాలు చెప్పేలా, ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విశ్లేషణ కోసం ఉన్నత స్థాయి కమిటీ
జయదేవ హృద్రోగ ఆసుపత్రుల డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో మరిన్ని మరణాలు నివారించేందుకు ఇది కీలక అడుగుగా కనిపిస్తోంది.వైద్య నిపుణులు ప్రజలకు ముఖ్య సూచన ఇస్తున్నారు – బీపీ, షుగర్ ఉన్నవారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ఛాతిలో నొప్పి, ఊపిరితిత్తుల్లో అసౌకర్యం కలిగితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని తెలిపారు.
Read Also : Robotics : ఎగిరే రోబో ఇదే మొదటిసారి: ఇటలీ శాస్త్రవేత్తల అద్భుతం