Delhi negligence deaths : అధికారుల నిర్లక్ష్యం ఢిల్లీలో వరుసగా ప్రాణాలు తీస్తోంది. జనక్‌పురిలో జరిగిన ప్రమాదం మరచిపోకముందే, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే మరో విషాద ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వాయవ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఓ వ్యక్తి ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
రోహిణి సెక్టార్–32లో బీహార్‌కు చెందిన బిర్జూ కుమార్ (30) అనే కార్మికుడు సోమవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని ఈ ప్రాంతంలో మ్యాన్‌హోల్‌కు మూత లేకపోవడంతో బిర్జూ అనుకోకుండా అందులో పడిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతని స్నేహితుడు బుధన్ దాస్ కూడా అక్కడే ఉన్నప్పటికీ, ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో ఈ ఘటనను వెంటనే గుర్తించలేకపోయారు.
మరుసటి రోజు మధ్యాహ్నం స్పృహలోకి వచ్చిన తర్వాత తన స్నేహితుడు కనిపించకపోవడంతో గాలించగా, ఓపెన్ మ్యాన్‌హోల్‌లో బిర్జూ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సుమారు ఆరు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు.
Read Also: Manipur Violence: మణిపుర్‌లో మరోసారి అల్లర్లు
ఇదే తరహాలో ఐదు రోజుల క్రితం ఫిబ్రవరి 6న పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో కమల్ ధ్యానీ (25) అనే యువకుడు రోడ్డు మధ్యలో ఉన్న లోతైన గుంతలో పడిపోయి (Delhi negligence deaths) ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీ జల్ బోర్డు తవ్విన 15 అడుగుల లోతైన గుంతకు ఎటువంటి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం ఈ ప్రమాదానికి కారణమైంది.
వరుసగా జరుగుతున్న ఈ మరణాలతో ఢిల్లీ ప్రభుత్వం, పరిపాలనా వ్యవస్థపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనక్‌పురి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు వాటర్ బోర్డు ఇంజనీర్లను సస్పెండ్ చేయగా, సంబంధిత కాంట్రాక్ట్ సంస్థపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై అధికార పార్టీల మధ్య రాజకీయ దుమారం కొనసాగుతోంది. రాజధానిలో మౌలిక వసతుల వైఫల్యాలు సామాన్యుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: