మేఘాలయ రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాల పాటు తన ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నేత డి.డి. లపాంగ్ (D.D. Lapang) ఇకలేరు. 91 ఏళ్ల వయస్సులో ఆయన శుక్రవారం రాత్రి షిల్లాంగ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డి.డి. లపాంగ్ నాలుగు సార్లు మేఘాలయ ముఖ్యమంత్రి (Chief Minister of Meghalaya) గా బాధ్యతలు చేపట్టారు. అరుదైన రాజకీయ పరిణామాల సమయంలో, రాష్ట్రం అస్థిరతను ఎదుర్కొంటున్న సందర్భాల్లో, ఆయన నాయకత్వం మేఘాలయ ప్రజలకు భరోసా కల్పించింది. 1970లలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన లపాంగ్, దశాబ్దాల పాటు ప్రజా సమస్యలపై గళమెత్తారు. ఆయనకు ఉన్న అనుభవం, సమన్వయకర్తగా ఉన్న ప్రతిభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు దోహదపడింది.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆయన
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లపాంగ్, పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆయన పాటుపడిన కృషి గుర్తించదగ్గది. గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక పథకాలు రూపొందించారు.1934 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన లపాంగ్.. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరిగా నిలిచారు.
ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం (Political power) 1972లో ప్రారంభమైంది. అప్పట్లో నాంగ్పో అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. తొలిసారిగా మేఘాలయ శాసనసభలో అడుగు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రారంభించిన ఆయన ప్రస్థానం.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా గెలవడానికి ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనం. సుమారు రెండు దశాబ్దాల పాటు వివిధ శాఖలకు ఆయన మంత్రిగా కూడా పని చేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్ర పరిపాలన మరియు అభివృద్ధి అంశాలపై లోతైన అవగాహన పెంచుకున్నారు.

మేఘాలయ సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసి
లపాంగ్‌కు నాలుగు సార్లు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత దక్కింది. 1992 నుంచి 2008 మధ్య కాలంలో ఆయన వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేఘాలయ సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సంక్షోభ సమయాల్లో కూడా ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించి, రాజకీయ స్థిరత్వానికి కృషి చేశారు.
లపాంగ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజల సమస్యలపై స్పందించే వ్యక్తిగా.. రాష్ట్ర సంక్షేమానికి నిబద్ధత కలిగిన నేతగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ పార్టీల సరిహద్దులకు అతీతంగా ఆయన అందరి గౌరవాన్ని పొందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు తమ సంతాపం తెలియజేశారు. లపాంగ్ మృతి మేఘాలయ రాష్ట్రానికి, ముఖ్యంగా ఆయనను అభిమానించే ప్రజలకు తీరని లోటని చెప్పుకొచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూనే.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read hindi news: epaper.vaartha.com
Read Also: