పాకిస్థాన్‌కు గూఢచారం – సీఆర్పీఎఫ్ ఏఎస్సై మోతీరామ్ జాట్ అరెస్ట్
దేశ భద్రతకు తీవ్రమైన ముప్పుగా నిలిచే అంశంగా మారిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై) మోతీరామ్ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థలకు దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని అందించినట్లు మోతీరామ్‌పై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. అతడు జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తుండగా, ఉగ్రదాడి జరిగే వారం రోజుల ముందు వరకు అక్కడే ఉన్నాడన్నది అధికారులు వెల్లడించిన కీలక అంశం.
2023 నుంచి మదిగూడిన గూఢచారం – అంతర్గత నిఘాలో చిక్కిన మోతీరామ్
అధికారుల కథనం ప్రకారం, మోతీ రామ్ జాట్ 2023 నుంచి పాకిస్థాన్ గూఢచార సంస్థలకు సమాచారాన్ని అందిస్తున్నాడు. అతడి సోషల్ మీడియా కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉండటంతో సీఆర్పీఎఫ్ (CRPF) అంతర్గత నిఘా విభాగం కొంతకాలంగా అతడిపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అతడి గూఢచర్య కార్యకలాపాలు బయటపడ్డాయి. దీంతో సీఆర్పీఎఫ్ (CRPF) అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని నాలుగు రోజుల పాటు విచారించి, సర్వీసు నుంచి తొలగించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏ ((NIA) కు అప్పగించారు.

సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు – భార్య ఖాతాలో డబ్బుల లావాదేవీలు
మోతీ రామ్ జాట్ సోషల్ మీడియా వేదికగా పాకిస్థానీ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గూఢచర్యం ద్వారా అతడు లక్షల రూపాయల మొత్తాన్ని అందుకున్నాడని, ఆ డబ్బును తన భార్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మన సైనిక బలగాల రహస్య ఆపరేషన్లు, వ్యూహాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాల మోహరింపు వంటి అత్యంత కీలకమైన సమాచారాన్ని అతడు పాకిస్థాన్‌కు చేరవేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
విశేషంగా పహల్గామ్ విధుల్లో కీలక సమాచారం లీక్ చేసిన అనుమానం
ముఖ్యంగా పహల్గామ్‌లో మోతీరామ్ విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అక్కడ ఉగ్రదాడి జరగడం, ఆ ప్రాంతానికి సంబంధించిన భద్రతా మోహరింపుల వివరాలు లీక్ అయ్యి ఉండవచ్చన్న అనుమానాలు ముదురుతున్నాయి. దేశ భద్రతకు సంబంధించి అతడు పంచిన సమాచారంలో వ్యూహాత్మక స్థావరాల వివరాలు, సైనిక చలనాలు, రహస్య ఆపరేషన్‌లు ఉన్నట్టు ఎన్ఐఏ (NIA) పేర్కొంది. ఇది కేవలం భద్రతా వ్యవస్థలకే కాకుండా, దేశ సార్వభౌమత్వానికి సవాలుగా నిలుస్తోంది.
భద్రతా వ్యవస్థల్లో గూఢచారుల ముప్పు – అప్రమత్తంగా ఉన్న కేంద్రం
ఈ ఘటన మరొకసారి స్పష్టం చేసింది – దేశ భద్రతా వ్యవస్థల్లో అంతర్గత ముప్పు ఎంత ప్రమాదకరమో. సైనిక రంగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై నిరంతర నిఘా, విస్తృతంగా కాంటర్ ఇంటెలిజెన్స్ చర్యలు అవసరమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ కేసు నేపధ్యంలో మరిన్ని సీఆర్పీఎఫ్ జవాన్లపై దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Read also: Brij Bhushan Sharan Singh : మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు ఊరట : పోక్సో కేసు