ఇటీవల దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులు సేవల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, తాజాగా ఓ ప్రముఖ కమెడియన్ కూడా ఎయిర్ ఇండియా సేవలపై అసహనం వ్యక్తం చేశారు. అతను తన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా ఎయిర్ ఇండియాతో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొన్న ఈ మధ్య విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎయిర్ ఇండియాపై మండిపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఎయిర్ ఇండియా సేవలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సైతం అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు సమయానికి రావట్లేదని ఆమె ఆరోపించారు. తాను గంటలకుపైగా వేచి ఉండాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఏదో ఒక వివాదంతో సంస్థ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
విమానం ఎక్కము
ఇటీవల క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా ఎయిర్ ఇండియా విమానయాన సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్లు లేని విమానంలో గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఐపీఎల్ 2025 కోసం భారత్‌కు వచ్చిన వార్నర్, తన విమాన ప్రయాణ అనుభవం చాలా చేదుగా మారిందని పేర్కొన్నారు.తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో”@airindia మేము పైలట్లు లేని విమానం ఎక్కము, గంటల తరబడి విమానంలో వేచి ఉన్నాము. మీకు పైలట్లు లేరని తెలిసి కూడా ప్రయాణీకులను ఎందుకు ఎక్కించారూ?” అంటూ ప్రశ్నించారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ట్వీట్ వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్లు ఎయిర్ ఇండియా సేవలను తీవ్రంగా విమర్శిస్తూ విమానయాన సంస్థపై మండిపడుతున్నారు.
దుర్భరంగా
ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ ఇటీవలే తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి ప్రయాణించారు. అయితే, ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. విమానం రెండు గంటలు ఆలస్యమైనట్లు చెప్పారు. ఒక్కో సీటు కోసం రూ.50,000 చెల్లించినప్పటికీ తమకు విమానంలో విరిగిన టేబుల్, విరిగిన లెగ్ రెస్ట్‌లు, వంగిపోయిన సీటు కేటాయించారన్నారు. ఈ ప్రయాణం మొత్తం దుర్భరంగా సాగిందని పేర్కొన్నారు. తన భార్య కాలు విరగడంతో ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందుగానే వీల్ చైర్ సర్వీసు బుక్ చేసుకున్నప్పటికీ సిబ్బంది దాన్ని తమకు సమకూర్చలేదని ఆరోపించారు. నాలుగు బ్యాగులు మోస్తూ సాయం చేయమని సిబ్బందిని అడిగితే ఒక్కరూ పట్టించుకోలేదని ఆరోపించారు.
Read Also: Bollywood : బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్..ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?