భారత 51 ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గతేడాది నవంబర్ 11వ తేదీన బాధ్యతలు చేపట్టగా మంగళవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళ వారం రోజే చివరి రోజు కాగా సుప్రీం కోర్టు(Supreme Court)లో బెంచ్ కార్యకలాపాలు ముగిసిన తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తాను పదవీ విరమణ తర్వాత ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలోనే ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు అందరి ముందే వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.1960 మే 14వ తేదీన జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన 2005లో ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో అడిషనల్ జడ్జిగా నియమితులు అయ్యారు. 2006లో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ ఘనత సాధించారు. ఇలా పదవులు పొందిన వాళ్లు కొంత మందే కాగా అందులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒకరు. అయితే 2019లో జనవరి 18వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రాధాన్యత
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నాకు ఆయన స్వయానా సోదరుడి కుమారుడు. ముఖ్యమైన రాజ్యాంగ సంబంధ కేసుల్లో పెదనాన్న జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఇచ్చిన తీర్పులతో స్ఫూర్తి పొందిన సంజీవ్ ఖన్నా న్యాయవాద వృత్తి వైపు మొగ్గు చూపారు. ఆయన బాటలోనే నడుస్తూ సీజేఐగా కూడా ఎంపిక అయ్యారు.ఆయన పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగానే సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది.గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా, న్యాయమూర్తులుగా పనిచేసిన పలువురు పదవీ విరమణ(retirement) తర్వాత ప్రభుత్వ పదవులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇది విమర్శలకు తావిస్తోంది. ఈ తరుణంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా తాను పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ పదవీ చేపట్టబోనని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని సూచించారు. న్యాయ రంగానికి తన సేవలను కొనసాగిస్తానని ఖన్నా పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన రెండు ఇన్నింగ్స్(Two innings)లు ముగిశాయని, ఇక మూడో ఇన్నింగ్స్‌లో న్యాయరంగానికి సేవలు అందించే మరో పని చేపట్టబోతున్నట్లు తెలిపారు.వీడ్కోలు కార్యక్రమంలో తదుపరి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ బీఆర్ గవాయ్, పలువురు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా పనితీరును, ఆయన హార్ధికమైన వ్యవహార శైలిని ప్రశంసించారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు.
Read Also : JUSTICE: 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం