చర్ల: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు (Maoist) ఉద్యమానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావు, హిడ్మా మరికొందరు కేంద్ర కమిటీ సభ్యుల మరణం, అదే క్రమంలో మరికొందరి అగ్రనేతల లొంగుబాట్లతో నిస్తేజంలో ఉన్న దళ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు లొంగుబాటుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు.
Read Also: Sabarimala: తమిళనాడులో ప్రమాదం..ఇద్దరు దుర్మరణం

ప్రభుత్వ విధానాల సానుకూల ఫలితాలు
చత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం నక్సల్ నిర్మూలన మరియు పునరావాస విధానం పథకంపై సానుకూల ఫలితాలు వస్తున్నాయని మరోసారి స్పష్టంగా కనిపించిందని ఎస్పీ అన్నారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారని, బెటాలియన్ నంబర్ 1, వివిధ ఏరియా కమిటీల సభ్యులు, ప్లాటూన్ కంపెనీ, మిలీషియా కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం సౌత్ సబ్ జోనల్ బ్యూరో నుండి 39 మంది మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ధమారి, గరియాబంద్, నొవాపాడ డివిజన్ సభ్యులు ఉన్నారు.
లొంగుబాటుకు కారణాలు, ప్రస్తుత గణాంకాలు
పునరావాసం, భద్రత మరియు సంభాషణ ఆధారిత విధానం, నియ్యద్ నెల్లా నార్ పథకం కార్యకర్తలను లొంగిపోవడానికి మూలకారణం అని ఎస్పీ తెలిపారు. జనవరి 2025 నుండి రాష్ట్రంలో నక్సలైట్ (Naxalite) సంఘటనలలో పాల్గొన్న 528 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 560 మంది లొంగిపోయారు. ఇదే సమయంలో వివిధ ఎన్‌కౌంటర్లలో 144 మంది మావోయిస్టులు మరణించారు. జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 790 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసారని, 1,031 మందిని అరెస్టు చేశామని, 202 మంది ఎన్‌కౌంటర్లలో మరణించినట్లు వెల్లడించారు. లొంగిపోయిన ఒక్కొక్కరికి రూ.50 వేల తక్షణ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ (CRPF) ఉన్నతాధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: