భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా(BJP) నితిన్ నబీన్ (45) ఎన్నికైన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఈ కీలక పదవిని దక్కించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనుండగా, అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
Read Also: Andhra Pradesh: నేడు విశాఖకు రానున్న రాహుల్ గాంధీ

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. తక్కువ వయసులోనే పార్టీ అత్యున్నత బాధ్యతలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారి తీసింది.
చిన్న వయసులో కీలక బాధ్యతలు… పార్టీ చరిత్రలో కొత్త అధ్యాయం
నితిన్ నబీన్(BJP) 1980లో రాంచీలో జన్మించారు. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2006లో తండ్రి మృతి అనంతరం నితిన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తదుపరి 2010, 2015, 2020 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. తాజాగా 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నితిన్, ఆర్ఎస్‌ఎస్ నేపథ్యంతో క్రమంగా ఎదిగి, వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు.
2023లో ఛత్తీస్‌గడ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా బాధ్యతలు నిర్వహించిన నితిన్, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పార్టీ హైకమాండ్ దృష్టిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉమ్మడి బిహార్ ప్రాంతం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్ష స్థాయికి ఎదిగిన తొలి నేతగా నితిన్ నబీన్ చరిత్ర సృష్టించారు. ఇక ఈ ఏడాది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, నితిన్ నబీన్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు, వివిధ రాష్ట్రాల నాయకత్వాన్ని ఎలా సమన్వయం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: