ఈ ఏడాది(2025) బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Election) జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఎన్నికల కమిషన్ (Election Commission) కసరత్తు చేస్తోంది. రెండు లేదా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలిసింది. దీపావళి (Diwali) (అక్టోబర్ 20), ఛత్ పూజ (అక్టోబర్ 28) (Chhath Puja)ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను షెడ్యూల్ చేయనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా నివేదించింది.

నవంబర్ 22తో ముగియనున్న బీహార్ అసెంబ్లీ పదవీకాలం
కాగా, బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. అంతకంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈనెలలోనే బీహార్‌ను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. 2020 బీహార్ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఓటింగ్ జరిగింది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రెండేళ్లకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. అన్ని విషయాలలో బీజేపీదే పై చేయి కావడంతో ఆ కూటమిని వదిలేసి 2022లో ఆర్జేడీ పంచన చేరి నితీశ్ తన పదవిని నిలబెట్టుకున్నారు.