విమాన ప్రయాణం ఎప్పటికప్పుడు వేగవంతంగా, సౌకర్యవంతంగా మారుతున్నా ఇటీవల భారత్‌లో విమాన సేవల్లో సాంకేతిక, నిర్వహణ సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు (International airlines) వరుసగా విమాన సేవలను రద్దు చేస్తుండటం, సాంకేతిక లోపాలతో విమానాలు మధ్యలోనే తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడటం పట్ల ప్రయాణికుల్లో అసంతృప్తి పెరుగుతోంది.

ఎయిర్ ఇండియా – సేవల రద్దు, నిర్వహణ సమస్యలు
తాజాగా ఎయిర్ ఇండియా (Air India) ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ఇండియా విమానాలను సాంకేతిక, నిర్వహణ సమస్యలు వెంటాడటం ఆందోళనకు గురిచేస్తోంది.
రద్దైన అంతర్జాతీయ రూట్లు:
తాజాగా నాలుగు దేశీయ, మరో నాలుగు అంతర్జాతీయ సేవలను ఎయిర్ఇండియా రద్దు చేసింది. మెయింటెనెన్స్, కార్యాచరణ సమస్యల కారణంగా వీటిని రద్దు చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇంటర్నేషనల్ సర్వీసుల్లో దుబాయ్-చెన్నై, దిల్లీ-మెల్‌బోర్న్, మెల్‌బోర్న్-దిల్లీ, దుబాయ్- హైదరాబాద్ ప్రయాణించాల్సిన విమానాలు ఉన్నాయి.
రద్దైన దేశీయ రూట్లు:
ఇక డొమెస్టిక్ సర్వీసుల్లో పుణె-దిల్లీ, అహ్మదాబాద్-దిల్లీ, హైదరాబాద్-ముంబయి, చెన్నై-ముంబయి విమానాలు ఉన్నాయి.
సాంకేతిక లోపాలు, నిర్వహణ లోపాల నేపథ్యంలో జూలై 15 వరకు సుమారు 15 శాతం అంతర్జాతీయ సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లోని కొన్ని ప్రధాన మార్గాల్లో ఈ తగ్గింపు ప్రభావం చూపనుంది. భారీగా ఉండే బోయింగ్ 777 విమానాల్లో మరింతగా తనిఖీలు చేపట్టనుండటం, ఇరాన్ గగనతల మూసివేతల కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిరిండియా వివరించింది. దీని కారణంగా ప్రభావితమయ్యే ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
ఇక మరోవైపు ఇండిగో విమానానికి చెందిన ఓ ఘటన కూడా కలకలం రేపింది. చెన్నై నుంచి మధురై వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం కలకలం రేపింది. పైలట్ అప్రమత్తమై విమానాన్ని మళ్లీ చెన్నైకే తిరిగొచ్చి ల్యాండ్ చెయ్యడంతో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఈ ఉదయం టేకాఫ్ అయిన కాసేపటికే ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్ గుర్తించారు. వెంటనే చెన్నై ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చారు. విమానం ల్యాండింగ్‌కు అనుమతి రావడంతో పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 78 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను మరో విమానంలో మధురై తరలించినట్టు అధికారులు తెలిపారు.
Read also: Droupadi Murmu: అంధ విద్యార్థుల పాటలకు కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము