దేశం మొత్తంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు ఊపందుకున్నాయి. అన్నిదిక్కులూ తీరా జాతీయ గీతాలు వినిపించేందుకు సిద్దమవుతున్నాయి. రాజధాని ఢిల్లీ నుంచి ప్రతి ఊరు, పల్లె వరకూ వేడుకల జోష్ కనిపిస్తోంది.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆగస్టు 14 (August 14) (గురువారం) జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే ఈ ప్రసంగం ముందు హిందీలో, తర్వాత ఆంగ్లంలో ఉంటుంది.ప్రభుత్వ ప్రకటనల ప్రకారం, ఈ ప్రసంగాన్ని దూరదర్శన్ జాతీయ నెట్‌వర్క్‌తో పాటు, ఆకాశవాణి స్టేషన్లలోనూ ప్రత్యక్షంగా వినిపించనున్నారు. రాత్రి 9:30కి ప్రాంతీయ భాషల్లోనూ ఈ ప్రసంగం వినిపించనుంది. దేశమంతా వినిపించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆగస్టు 15 ఉదయం, ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ప్రతి ఏడాది జరిపే సాంప్రదాయ వేడుకగా మారింది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందిన ఘట్టాన్ని గుర్తు చేస్తూ దేశం ఈరోజున ఘనంగా జరుపుకుంటుంది.

జాతీయ గౌరవానికి నివాళులు, సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, దేశవ్యాప్తంగా జెండా వందనాలు, పటాకులే కాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పిస్తారు.ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇండియా గేట్, మండి హౌస్, మథురా రోడ్ వంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పార్కింగ్ స్టిక్కర్లు లేని వాహనాలను ఆ ప్రాంతాలకు రాకుండా చూస్తున్నారు.
మెట్రో సేవలకు స్పెషల్ షెడ్యూల్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు ఢిల్లీ మెట్రో స్పెషల్ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 15 ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడవనున్నాయి. మొదటి రెండు గంటలపాటు ప్రతి 30 నిమిషాలకు ఒక్క రైలు నడుస్తుంది. తర్వాత సాధారణ షెడ్యూల్ కొనసాగుతుంది.ప్రజల్లో దేశభక్తిని రగిలించేందుకు ఢిల్లీలోని ప్రముఖ ప్రదేశాల్లో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎన్‌సీసీ బ్యాండ్‌లతో ర్యాలీలు, లైవ్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో దేశభక్తికి మరింత ప్రాణం పోస్తున్నారు.ప్రతి భారతీయుడి గుండె తడిమే రోజు ఇది. మన స్వాతంత్ర్యానికి మూలకారణమైన వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, తలెత్తి నడిచే వేళ. జెండాను గర్వంగా ఎగురవేస్తూ దేశమంతా ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతుంది.
Read Also :