అమరావతి మరోసారి చరిత్ర సృష్టించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్ 15 నుండి 20వ తేదీ మధ్య ఆయన ఏపీలో పర్యటించి, ముఖ్యంగా రాజధాని అమరావతి పనులను పునఃప్రారంభించనున్నారు. మూడేళ్లలో అమరావతిని పూర్తిగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతితో పాటు రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల విలువైన పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.

అమరావతికి భరోసా – మోదీ పర్యటన
2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. అక్టోబర్ 21న ప్రధాని మోదీ స్వయంగా అమరావతి శంకుస్థాపన చేసి, రాజధాని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర రాజధాని తరలింపు అంశం చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల పాటు రాజధాని అభివృద్ధి ఆగిపోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిని నిర్మించేందుకు మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో సుమారు రూ. లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ జరిపే అవకాశముంది. ఇందులో రూ. 40 వేల కోట్లతో అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు ఉండగా, మిగతా పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు ఇప్పటికే పిలిచారు. ముఖ్యంగా రహదారులు, శాశ్వత భవనాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు
ప్రధాని పర్యటన ఏర్పాట్లను నగరాభివృద్ధి మంత్రి పి. నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తూ, అధికారి స్థాయిలో సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధుల మంజూరు గురించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతుండగా, ప్రధాని పర్యటన ఈ పనులకు మరింత ఊపునిచ్చే అవకాశం ఉంది. నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని, మౌలిక సదుపాయాల కల్పనతో అమరావతి ఒక పూర్తి స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ అమరావతికి రాకతో, రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రాజధాని అభివృద్ధి కోసం కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందజేస్తుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.