డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు ఏపీ శాసనమండలిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా నాగబాబు స్పందిస్తూ,ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన బాధ్యతను మరింత పెంచారని చెప్పారు. ప్రభుత్వ పాలనలో ప్రజాసేవ చేసేందుకు తనను ఎమ్మెల్సీ చేసిన చంద్రబాబు, పవన్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందని నాగబాబు పేర్కొన్నారు. ప్రజా సేవ చేయడానికి తనకు ఈ అవకాశం లభించిందని, ప్రభుత్వ విధానాలను అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా స్పందించారు. ఎమ్మెల్సీ పదవి పొందడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనతో పాటు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, సోము వీర్రాజు సహా కూటమి అభ్యర్థులందరికీ నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. తన నామినేషన్ సమయంలో వెన్నంటి ఉన్న జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయాన్ని తన కుటుంబంగా భావించే జనసైనికులందరికీ అంకితం చేస్తూ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషిచేస్తానని నాగబాబు పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సమన్వయం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.నాగబాబుకు మంత్రిపదవి ఇవ్వనున్నట్లు చంద్రబాబు నాయుడు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా మారిన తర్వాత, ఆ పార్టీకి మరింత ప్రాధాన్యత ఇవ్వడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం కూడా అదే దిశగా ముందుకు సాగుతున్న సంకేతంగా భావించవచ్చు.నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జనసేన పార్టీకి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రాజకీయ ప్రయాణం జనసేనకు ఎంతవరకు బలం చేకూర్చుతుందో చూడాలి.