పహల్గాం దాడి తరవాత ఆపరేషన్ సింధూర్ సజావుగా కొనసాగుతోంది
పహల్గాం దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. పాక్ ఆధారిత ఉగ్రవాదుల చర్యలపై గట్టి ప్రతిఘటనగా భారత సైన్యం ఈ ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ సమయంలో సైన్యానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ దేశభక్తిని వ్యక్తపరిచారు. ఈ సమయంలో దేశం ఒకతాటిపై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముస్లింల పక్షాన స్పష్టమైన ప్రకటన చేసిన పర్సనల్ లా బోర్డు
ఈ నేపథ్యంలో దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలకమైన ప్రకటన చేసింది. ఇవాళ జరిగిన ఆఫీస్ బేరర్ల ప్రత్యేక ఆన్‌లైన్ సమావేశంలో వారు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్నందున ఇది అత్యంత ఆందోళనకర పరిణామమని లా బోర్డు పేర్కొంది. దేశం, దాని ప్రజల రక్షణ కోసం తీసుకునే ప్రతి అవసరమైన చర్యకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, సాయుధ దళాలు ఒకటిగా కట్టడి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
ఉగ్రవాదానికి మద్దతు లేదు: ఇస్లామిక్ విలువలపై స్పష్టత
ఉగ్రవాదానికి మతంతో ఎలాంటి సంబంధం లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ఇస్లామ్ బోధనల ప్రకారం అమాయకుల హత్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం లేదని, మానవ విలువలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, ఇటువంటి హింసాత్మక మార్గాలను తిరస్కరించింది. అలాగే భారత్, పాకిస్తాన్‌లు తమ మధ్య సమస్యలను శాంతియుత దౌత్య మార్గాలలో పరిష్కరించుకోవాలని, యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని స్పష్టంగా పేర్కొంది. ముఖ్యంగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం భయంకరంగా ఉంటుందని హెచ్చరించింది.
సేవ్ వక్ఫ్ ఉద్యమం కొనసాగుతుంది – బహిరంగ కార్యక్రమాలకు తాత్కాలిక విరామం
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సేవ్ వక్ఫ్ ఉద్యమంలో భాగంగా జరుగుతున్న బహిరంగ కార్యక్రమాలు వాయిదా వేయాలని లా బోర్డు నిర్ణయించింది. మే 16 వరకూ బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలను నిలిపివేస్తామని ప్రకటించింది. అయితే, ఇతర కార్యక్రమాలు — మసీదులలో ప్రసంగాలు, మతాంతర సంభాషణలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, జిల్లా కలెక్టర్లు మరియు న్యాయాధికారులకు మెమోరాండమ్‌ల సమర్పణ, మీడియా సమావేశాలు తదితర ఇండోర్ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తామని తెలిపింది.
పరిస్థితి త్వరగా చక్కబడాలని ఆశ
దేశంలోని ముస్లిం సమాజం తరఫున మాట్లాడుతున్న లా బోర్డు, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే చల్లబడాలని, సాధారణ పరిస్థితులు తిరిగి రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. దేశ భద్రతకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో, మతపరంగా ఏవిధమైన భిన్నాభిప్రాయాలు లేకుండా ప్రజలందరూ సమైక్యంగా వ్యవహరించాలని కోరింది.
Read also: Delhi: ఢిల్లీలో హై అలెర్ట్, విమానాశ్రయాల మూసివేత
Read also: India Pakistan War: సైన్యానికి మీ సేవలు అవసరం అన్నకేంద్రం