ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల ఉద్యమం (Municipal workers’ movement) ఉధృతంగా మారింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె(Strike )కు దిగనున్నట్లు ట్రేడ్ యూనియన్లు ప్రకటించాయి. తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో గత 38 రోజులుగా నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి.
జీతాల పెంపుపై నిర్లక్ష్యం – కార్మికుల ఆవేదన
తక్కువ జీతాలపై జీవనం సాగించడం ఎంతో కష్టమైందని, ధరలు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో కనీస వేతనం కూడా అందకపోవడం దురదృష్టకరమని కార్మికులు వాపోతున్నారు. తమ జీతాలను సమీక్షించి పెంచాలని ఎన్నో మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనపడలేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో రెండుసార్లు జరిగిన చర్చలు ఫలించలేదని, దీంతో ఇక సమ్మె తప్పదని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వ స్పందనపై ఉత్కంఠ
కార్మికుల సమ్మెకు వెళ్లడంతో మున్సిపల్ సేవలు స్తంభించే అవకాశం ఉందని అంచనా. తడి, పొడి చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కీలక సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముంది. సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందా లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే స్పందించి, సమస్యలు పరిష్కరించి, సమ్మెను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also : Srisailam Dam : శ్రీశైలానికి భారీ వరద