ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం టీడీపీ పిఠాపురం సీటును వదిలిపెట్టిన ఎస్వీఎన్ఎస్ వర్మకి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినా, ఇప్పటివరకు వర్మకు ఎమ్మెల్సీ పదవి రాలేదు.ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారని ప్రచారం జరుగుతుండగా, జనసేన నేత క్రాంతి బార్లపూడి ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ అంతర్గత వ్యవహారంగా పేర్కొంటూ, పవన్ కళ్యాణ్‌ను అనవసరంగా వివాదంలోకి లాగడం సరైనదికాదని తేల్చిచెప్పారు.
క్రాంతి కౌంటర్
“పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి పదవి రాకపోవడానికి జనసేనకు ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా టీడీపీ తన సొంత వ్యవహారం” అని క్రాంతి స్పష్టం చేశారు. “మీరు టీడీపీతోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలి. జనసేనను తప్పుబట్టడం తగదు” అంటూ ఆమె ట్వీట్ చేశారు.అంతే కాదు, వర్మ అసంతృప్తిపై ఈ విదంగా స్పందించారు, “మీరు చేస్తున్న రాజకీయాలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి మీ తీరే కారణమని, అందుకే ముఖ్యమంత్రి మిమ్మల్ని పక్కన పెట్టారని ఎందుకు అనుకోకూడదు?” అని ప్రశ్నించారు.
ప్రచారం
వర్మ అసంతృప్తిని వైసీపీ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని, ఈ వ్యవహారంపై ఆ పార్టీ కంటెంట్ క్రియేట్ చేస్తూ తనకు అనుకూలంగా ప్రచారం నడిపిస్తున్నట్లు క్రాంతి వ్యాఖ్యానించారు. “మీరు వైసీపీతో టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ మీడియా మిమ్మల్ని ప్రచారం చేస్తోంది – ఇది యాదృచ్ఛికమా?” అంటూ ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధికి పాటుపడుతున్నారని, ప్రజల గుండెల్లో ఆయనకు సుస్థిర స్థానం ఏర్పడిందని తెలిపారు. అదే సమయంలో, “ఒకవేళ పదవి రాకపోతే, కూటమి ఐక్యత దెబ్బతినేలా ప్రవర్తించడం తగునా?” అని ప్రశ్నించారు.
త్యాగాలను మరిచిపోతే
“కేవలం మీరు మాత్రమే త్యాగం చేశారు అనే భ్రమలు వద్దు. జనసేన, టీడీపీ, బీజేపీ—అందరూ కలిసి కూటమి విజయాన్ని సాధించారు” అని క్రాంతి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి కూటమికి మద్దతిచ్చారని, “అంతటి సంయమనం పాటించి, కార్యకర్తలను విజయపథంలో నడిపించారు” అని గుర్తుచేశారు.
ఆసక్తికరమైన వ్యాఖ్య
క్రాంతి మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు – “మీరు టీడీపీ కార్యకర్తల చేత చంద్రబాబును తిట్టిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు మీకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇస్తారు?” అంటూ నిలదీశారు. “ఈ లాజిక్ మిస్ అయ్యిందా?” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.పిఠాపురంలో ఎమ్మెల్సీ పదవి వివాదం రాజకీయంగా వేడెక్కుతుండగా, జనసేన నేత క్రాంతి బార్లపూడి కఠినంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. వర్మ అసంతృప్తిని వైసీపీ తనకు అనుకూలంగా మలచుకుంటోందని,కూటమి ఐక్యత దెబ్బతీయాలనే కుట్రలు చేస్తున్నారని. రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే అవకాశముందని హెచ్చరించారు.పవన్ కళ్యాణ్ కూటమి కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, టీడీపీ అంతర్గత వ్యవహారాన్ని జనసేనపై మోపడం అనుచితమని స్పష్టం చేశారు. ఈ వివాదం ఇక్కడే ముగుస్తుందా, లేదా మరింత రాజుకుంటుందా అనేది వేచిచూడాలి.