ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా ఓటములతో ఇబ్బందులు పడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్, చివరికి గెలుపు మార్గంలోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 168 స్కోరు చేసింది. శివమ్ దూబే(37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 2సిక్స్‌లు), ధోనీ(11బంతుల్లో 26 నాటౌట్, 4ఫోర్లు, సిక్స్) జట్టు విజయంలో కీలకమయ్యారు.బిష్ణోయ్ (2/18) రెండు వికెట్లు తీశాడు. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (49 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ సీజన్‌తో తొలి అర్ధ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో జడేజా (2/24), పతిరాన (2/45) తలా రెండు వికెట్లు తీశారు. వికెట్లు పడకపోయినా నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి లక్నోను కట్టడి చేశాడు.సీఎస్‌కే లో తొలి మ్యాచ్ ఆడిన ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27, 6 ఫోర్లు) సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. రచిన్‌తో కలిసి అతడు తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 52 పరుగులు జతచేశాడు. ఈ సీజన్ పవర్ ప్లేలో ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేయడం చెన్నైకి ఇది రెండోసారి మాత్రమే. అయితే అవేశ్ ఖాన్ రాకతో చెన్నై వికెట్ల పతనం మొదలైంది.అతడి 5వ ఓవర్లో రషీద్ పూరన్‌కు క్యాచ్ ఇవ్వడంతో చెన్నై ఇన్నింగ్స్ తడబడింది. క్రీజులో కుదురుకున్న రచిన్ మార్క్మ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. బిష్ణోయ్ రంగప్రవేశంతో సీఎస్‌కే కష్టాలు రెట్టింపయ్యాయి. బిష్ణోయ్ 13వ ఓవర్‌లో జడేజా(7) పెవిలియన్ చేరగా, ఓవర్ తేడాతో దిగ్వేశ్ బౌలింగ్‌లో విజయ్ శంకర్(9) పెవిలియన్ చేరాడు. దీంతో 111 పరుగులకే చెన్నై 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శివమ్ దూబే, కెప్టెన్ ధోనీ లక్నో బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ చెన్నైకి కీలక విజయాన్ని అందించారు.
కెప్టెన్
మైదానంలో ఎంతో కూల్‌గా కనిపించే ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన్ని అంతా ముద్దుగా తలా అని పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఎంఎస్ ధోనీ మరో రికార్డు సాధించారు.ఈ విజయంలో ధోనీ కీలకంగా వ్యవహరించారు. కేవలం 11 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ఈ మ్యాచ్ తర్వాత ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డును గెలుచుకోవడం ద్వారా ధోని 11 ఏళ్ల ఐపీఎల్ రికార్డును బద్దలుకొట్టాడు.ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డును గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 43 సంవత్సరాల 280 రోజుల వయస్సులో ఎంఎస్ ధోని ప్రవీణ్ తంబే 11 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. 2014లో ప్రవీణ్ తంబే 42 సంవత్సరాల 208 రోజుల వయస్సులో కేకేఆర్ పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న అతిపెద్ద వయస్సు గల ఆటగాడిగా నిలిచాడు. కానీ ఇప్పుడు ధోని ప్రవీణ్ తంబే రికార్డును బద్దలు కొట్టాడు.ఇప్పుడు తంబే రికార్డును ధోనీ బ్రేక్ చేశారు. మరోవైపు, 2011లో షేన్ వార్న్ రెండుసార్లు ఈ అవార్డు గెలుచుకున్నాడు. 41 సంవత్సరాల 223 రోజుల వయసులో, 41 సంవత్సరాల 211 రోజుల వయసులో వార్న్ అవార్డు అందుకున్నాడు. 2013లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 41 సంవత్సరాల 181 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఖాతాలో వేసుకున్నాడు.
Read Also: IPL 2025:లక్నో సూపర్‌జెయింట్స్‌పై సిఎస్ కె విజయం