సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలు, సినీ పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలపై ఆయన గళమెత్తడం కొత్తేమీ కాదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖండ 2 చిత్రానికి టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ 2 పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం “ప్రజల్ని దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తోంది” అని నారాయణ ఆరోపించారు.
Latest News: GHMC Expansion: హైదరాబాద్ నగర అంచులు మరింత ముందుకు
డిసెంబర్ 5న రిలీజ్ కానున్న అఖండ 2 చిత్రానికి ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రీమియర్ షోలకు రూ. 600, సింగిల్ స్క్రీన్లలో అదనంగా రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 పెంపు అనుమతిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రేట్లు పదిరోజుల పాటు అమల్లో ఉంటాయని అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం సినీ అభిమానులు, సామాన్య ప్రేక్షకుల్లో ఆగ్రహానికి దారితీయగా రాజకీయ నేత నారాయణ కూడా ఈ విషయంలో మండిపడ్డారు. “వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తున్న పేరుతో భారం మొత్తాన్ని ప్రజల మీద వేయడం సరైంది కాదు. ఇదే విధంగా టికెట్లు పెంచుతూ పోతే స్వయంగా ప్రభుత్వమే ఐబొమ్మ రవి లాంటి వాళ్లను పుట్టడానికి కారణమవుతుంది” అని వ్యాఖ్యానించారు. “పెద్ద సినిమాలకు పదే పదే రేట్లు పెంచుతున్నప్పుడు ప్రజలు ఛాయిస్ లేక సినిమా పైరసీ వైపు మొగ్గుచూపుతారు. తర్వాత ఆ రవిలాంటి వారిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. కానీ అలాంటి వ్యవస్థను సృష్టించిన ప్రభుత్వం, నిర్మాతలదే తప్పు” అని స్పష్టం చేశారు.

ఇక పోలీసుల పాత్రపై కూడా ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. “ఐబొమ్మ రవి లాంటి వారిని పోలీసులే అరెస్టు చేస్తారు. కానీ వారిని పుట్టించేది ఎవరు?… ప్రభుత్వం, నిర్మాతలే. మీరు ప్రజల జేబులకు చిల్లు పెడతారు. తర్వాత పైరసీ చేశారని అరెస్టు చేస్తారు. ఇలాంటి చర్యలకు నైతిక హక్కే లేదు” అని నారాయణ విమర్శించారు. అలాగే సంక్రాంతి సీజన్ రాబోతుండటంతో మరో నాలుగైదు పెద్ద సినిమాల విడుదల ఉంది. వాటికీ ఇదే లాజిక్ వర్తిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “సంక్రాంతి అంటే కుటుంబాలు కలిసి సినిమా చూడాల్సిన సమయంలో, రేట్లు పెంచడం ప్రజలపై మోపుతున్న భారం తప్ప మరేమీ కాదు. ఇది కళామతల్లి, థియేటర్ కల్చర్ రెండింటినీ దెబ్బతీస్తోంది” అని హెచ్చరించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/