టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల… అనుభూతుల్ని నిశ్శబ్దంగా నెరవేర్చే సినిమాల కోసం గుర్తింపు పొందిన దర్శకుడు. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘ఆనంద్’. ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయం కూడా సాధించింది. అయితే ఈ చిత్ర కథను మొదట పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాశారని శేఖర్ కమ్ముల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పవన్ కోసం ప్రత్యేకంగా ఈ కథను సిద్ధం చేసినప్పటికీ, ఆయనను కలిసే అవకాశం రాలేదట. ఫలితంగా ఈ కథ రాజా చేతిలోకి వెళ్లి, ‘ఆనంద్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శేఖర్ కమ్ముల సినిమాల వెనక ఉన్న ప్రయాణం
శేఖర్ కమ్ముల సినిమాల వెనక ఉన్న ప్రయాణం కూడా విశేషమే. ఏలూరులో జన్మించిన శేఖర్, హైదరాబాద్‌లో విద్యాబ్యాసం పూర్తిచేసుకుని అమెరికా వెళ్లి కంప్యూటర్ సైన్స్‌లో పీజీ చేశాడు. అక్కడే ఉద్యోగం చేస్తూ సినిమా పట్ల ఉన్న ఆసక్తితో ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరాడు. అప్పుడే రాసుకున్న ‘డాలర్ డ్రీమ్స్’ ద్వారా దర్శకుడిగా పరిచయమై నేషనల్ అవార్డు పొందాడు. అయితే కమర్షియల్ హిట్ కోసం చేసిన ప్రయత్నమే ‘ఆనంద్’ మూవీ. ఇందులో మొదట అసిన్, సదాలకు కథ వినిపించినప్పటికీ, చివరకు కమలినీ ముఖర్జీ హీరోయిన్‌గా ఎంపికైంది. రాజా, కమలినీ పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి.
‘ఆనంద్’ విడుదలకు ముందు ఆసక్తికర పరిణామం
‘ఆనంద్’ విడుదలకు ముందు కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ మూవీతో అదే రోజున విడుదల చేయడం ఇండస్ట్రీలో సాహసంగా పేర్కొనబడింది. అయితే రెండు సినిమాలు 2004 అక్టోబర్ 15న విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. పవన్ కళ్యాణ్‌తో ‘ఆనంద్’ సినిమా మిస్ అయినా, శేఖర్ కమ్ముల ఆయనతో ‘లీడర్ 2’ తీయాలని ప్రయత్నించాడన్న వార్తలు వచ్చినా, ఇప్పటివరకు ఆ కల నెరవేరలేదు. అయినా శేఖర్ కమ్ముల సరికొత్త కథలతో ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి.