భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర లిఖించాడు. జావెలిన్‌త్రోలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ సరికొత్త రికార్డుతో నీరజ్ కదంతొక్కాడు.దోహా డైమండ్ లీగ్‌లో భారత ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా(Neeraj Chopra) శుక్రవారం తొలిసారిగా జావెలిన్‌ను 90 మీటర్లకు మించి విసిరి చరిత్ర సృష్టించాడు. ఫైనల్‌లో తన మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 90.23 మీటర్లు విసిరి తన వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకున్నాడు. అంతకు ముందు నీరజ్ చోప్రా జూన్ 30, 2022న స్టాక్‌హోం డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్లు విసిరాడు. అయినా నీరజ్ చోప్రా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ తన చివరి ప్రయత్నంలో 91.06 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు.దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచినందుకు ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఆయనను ప్రశంసించారు. నీరజ్ చోప్రాను అభినందిస్తూ ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. “గొప్ప విజయం! దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించిన తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచి ఫలితం. నీరజ్ ప్రదర్శనతో భారత్ గర్విస్తోంది. ” అని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు.
దృఢ సంకల్పం
దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా గొప్ప ఆరంభాన్ని పొందాడు. కానీ జర్మనీకి చెందిన జులియన్ వెబర్(Julian Weber) 91.06 మీటర్లతో టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆరు త్రోలలో ఐదో త్రో వరకు నీరజ్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కానీ జులియన్ చివరి త్రోలో అతడిని అధిగమించాడు.అదే జోరును కొనసాగించడంలో చోప్రా ఒకింత విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో 80.56మీటర్లు విసిరిన నీరజ్‌ఆఖరిదైన ఆరో త్రోలో నీరజ్ 88.20మీటర్లకు పరిమితమయ్యాడు. ఇదే అదనుగా అప్పటి వరకు చోప్రా దరిదాపుల్లో ఉన్న జులియన్ వెబర్ ఆరో ప్రయత్నంలో ఏకంగా 91.06మీటర్లు విసిరి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. కెరీర్‌లో తొలిసారి అత్యుత్తమ మార్క్ అందుకున్న వెబర్ నీరజ్‌ను రెండో స్థానానికి పరిమితం చేయగా, అండర్సన్ పీటర్స్(85.64మీ)మూడో స్థానంలో నిలిచాడు. 90 మీటర్ల దూరం కేవలం సంఖ్య మాత్రమే కాదని, నీరజ్ చోప్రాకు అది ఒక సవాలుగా మారిందని తెలిసిందే. నీరజ్ చోప్రా చాలా సార్లు 90 మీటర్లకు దగ్గరగా వచ్చాడు. కానీ ప్రతిసారీ అతను 88 లేదా 89 మీటర్లకే పరిమితమయ్యాడు.టోక్యో ఒలింపిక్స్, బుడాపెస్ట్ ప్రపంచ ఛాంపియన్ షిప్(World Championship)లతో స్వర్ణం గెలిచినప్పటికీ నీరజ్ ఎప్పుడైనా 90 మీటర్లు దాటగలడా అనే ప్రశ్న మిగిలిపోయింది. ఇప్పుడు నీరజ్ దీనికి పూర్తి దృఢ సంకల్పంతో సమాధానం ఇచ్చాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఈ చారిత్రాత్మక త్రో చేసినప్పుడు మైదానం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ ప్రదర్శనలో వారి కొత్త కోచ్ జాన్ జెలెజ్నీ పాత్ర కూడా కీలకమే.
Read Also : IPL 2025: భారత కెప్టెన్లకు శిక్షణ ఇవ్వడానికి ఐపీఎల్ సరైనది: గవాస్కర్