ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్(Iran)పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defence Forces).. దాడులను ముమ్మరం చేశాయి. ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా మెరుపు దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రాజధాని టెహ్రాన్(Tehran)లోని ఇరాన్ అధికారిక టీవీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ న్యూస్ నెట్‌వర్క్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఆ సమయంలో వార్తల లైవ్ నడుస్తుండగా.. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ.. ఓ మహిళా యాంకర్ వార్తలు చదువుతున్నారు. అప్పుడే స్టూడియోపై మిసైల్ దాడి జరగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ లేడీ యాంకర్ అక్కడినుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గంటముందే ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ
ఈ క్షిపణి దాడితో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ న్యూస్ నెట్‌వర్క్ వార్తల ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. టెహ్రాన్‌లో టీవీ స్టూడియోలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈ దాడి జరగడానికి గంటముందే ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. మరోవైపు.. ఇరాన్‌పై వైమానిక ఆధిపత్యం సాధించినట్లు ఇజ్రాయెల్ సోమవారం వెల్లడించింది. పశ్చిమ ఇరాన్ నుంచి టెహ్రాన్ వరకు ఎయిర్‌స్పేస్ తమ కంట్రోల్‌లో ఉన్నట్లు ప్రకటించింది. ఇరాన్ మీడియాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కూడా హెచ్చరించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ టెల్ అవీవ్ పౌరులను ఖాళీ చేయాలని పిలుపునిచ్చింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళా యాంకర్
వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళా యాంకర్ భయంతో “అల్లా హు” అని అరుస్తూనే స్టూడియోను మధ్యలోనే వదిలిపెట్టి పారిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మహిళా యాంకర్ కామెంటరీ ఇస్తుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం స్టూడియోలోకి పొగ వచ్చి చేరింది. అదే సమయంలో సీలింగ్ కూలినట్లు కనిపిస్తోంది. ఆమెతో పాటు స్టూడియోలోని ఇతర సిబ్బంది కూడా అరుపులు ఆ వీడియోలో వినిపించాయి.
ఈ దాడి చేయడానికి గంట ముందు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ .. ఫార్సీ భాషలో ఒక హెచ్చరిక చేసింది. ఉత్తర తెహ్రాన్‌లోని డిస్ట్రిక్ట్ 3లో ఉండేవారు ఖాళీ చేయాలని.. మరీ ముఖ్యంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ న్యూస్ నెట్‌వర్క్ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతాన్ని హైలైట్ చేస్తూ తీవ్రంగా హెచ్చరించింది.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని పౌరులను ఖాళీ చేయాలని పిలుపు
ఇక టెహ్రాన్‌లోని టీవీ స్టేషన్‌పై దాడి తర్వాత.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని పౌరులను ఖాళీ చేయాలని పిలుపునిచ్చింది. తాము ప్రతీకార దాడి చేస్తామని పేర్కొంది. కేవలం సైనిక స్థావరాలను కాకుండా పౌర, మౌలిక సదుపాయాలు, మీడియా ప్లాట్‌ఫారాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ రెడ్ లైన్‌లను దాటిందని ఇరాన్ ఆరోపించిన నేపథ్యంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ హెచ్చరిక చేసింది. మరోవైపు.. సోమవారం ఉదయం ఇరాన్ చేసిన క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాలను తాకాయి.
Read Also: Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మండిపడుతున్న ముస్లిం దేశాలు