ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఖాళీ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ (సంతనూతలపాడు), ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), రేగం మత్స్యలింగం (అరకు), బి. విరూపాక్షి (ఆలూరు) లు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
లోకేశ్ విమర్శలు
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించారు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డీఎస్సీ పరీక్షలు నిర్వహించామని, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు.
తెదేపా హయాంలో నిర్వహించిన వివరాలు
రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014, 2018, 2019 సంవత్సరాల్లో మూడు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ మూడు డీఎస్సీల ద్వారా 16,701 టీచర్ పోస్టులు భర్తీ చేశామని వివరించారు.
భర్తీపై స్పష్టత
ప్రస్తుతం రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, వీటిని త్వరలోనే మెగా డీఎస్సీద్వారా భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్, అర్హతలు, పరీక్ష విధానం, తేదీల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి అన్నారు. అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా మెగా డీఎస్సీ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టీచర్ల ఖాళీలు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో లోకేష్ ఈ ప్రకటన చేశారు.
అభ్యర్థులకు శుభవార్త
కొన్ని సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ ప్రకటనతో భారీ ఊరట లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారు. మెగా డీఎస్సీ పరీక్ష కోసం సిలబస్, పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయని మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలను పూర్తిచేయాలంటే రూ.3వేల కోట్లు ఖర్చు అవుతుంది. మన బడి-మన భవిష్యత్తు.. నినాదంతో ఉపాధి హమీ దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే క్యాంపెయిన్‌ను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ప్రతి పాఠశాల, కాలేజీల్లో ‘ఈగల్’ బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు వేస్తున్నామని అసెంబ్లీలో లోకేష్ తెలిపారు.