తెలంగాణ ప్రభుత్వ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) భద్రాచలం (Bhadrachalam ) పరిసర ప్రాంతాల్లోని ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల పేరుతో ఈ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లోకి కలిపారని తెలిపారు. దీనివల్ల అక్కడి ప్రజలకు పాలనాపరంగా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.
పాలనలో అవ్యవస్థ.. అభివృద్ధి పక్కన పడుతోంది
ఆ గ్రామాలు భౌగోళికంగా భద్రాచలం మండలానికి చేరినవేనని, కానీ పాలనా పరంగా ఏపీకి చేరడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని తుమ్మల పేర్కొన్నారు. స్థానికులకు రేషన్, హెల్త్ సర్వీసులు, విద్య వంటి అవసరాలు తీర్చడంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెల్లడించారు. Telangana ప్రభుత్వ పథకాలు, నిధులు ఆ ప్రాంతాలపై వర్తించకపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాచలం దేవస్థాన భూములపై కూడా అభ్యంతరం
తుమ్మల ముఖ్యంగా భద్రాచలం ఆలయానికి చెందిన దేవస్థాన భూములు ఏపీ పరిధిలోకి వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల ఆలయ నిర్వహణ, అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. భద్రాచలం ఆలయం తెలంగాణ రాష్ట్రానికి ఆధ్యాత్మిక గర్వకారణం అని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఈ సమస్యలు మరింత క్లిష్టంగా మారకముందే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also : HYDRA: మాదాపూర్ సున్నం చెరువు ఆక్రమణలపై హైడ్రా కొరడా