దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. భర్త రాజా రఘువంశీని పక్కా ప్లాన్‌తో హత్య చేసిన సోనమ్ రఘువంశీ,మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, హత్య అనంతరం సోనమ్(Sonam) రైలు మార్గంలో ఇండోర్ కి చేరుకుందట. మే 25 నుంచి 27 మధ్యలో ఆమె ఇండోర్ కు వచ్చిందని, అక్కడ దేవాస్ గేట్ ప్రాంతంలోని ఓ అద్దె గదిలో తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసిందని పోలీసులు గుర్తించారు. ఈ గదిలోనే ఇద్దరూ భవిష్యత్తుపై చర్చించుకుని, పారిపోవాలనే వ్యూహం రచించినట్టు పేర్కొన్నారు. పోలీసుల ఆధారాల ప్రకారం, రాజ్ కుశ్వాహానే ఓ ట్యాక్సీ ఏర్పాటు చేసి సోనమ్‌ను ఉత్తరప్రదేశ్‌కి పంపించాడు.
సమాచారం
మే 23న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట నుంచి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించగా కన్పించకుండా పోయిన సోనమ్ (Sonam Raghuvanshi) ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షమైంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి, గాజీపుర్లో వదిలిపెట్టారని ఆమె ఆరోపించింది. అయితే, అవన్నీ అవాస్తవాలేనని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. “మే 25-27 మధ్య సోనమ్ రైలులో ఇండోర్ కి వచ్చింది. దేవాస్ గేట్లోని ఓ అద్దె గదికి చేరుకున్నట్లు మాకు సమాచారం అందింది,అని అదనపు డీసీపీ రాజేశ్ దండోటియా(Rajesh Dandotia) వెల్లడించారు.అయితే, యూపీ కి ఎందుకు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.బహుశా కేసును తప్పుదోవ పట్టించడం కోసమే ఆమె గాజీపుర కు వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. హత్య తర్వాత మేఘాలయ నుంచి ఆమె రైలులో గువాహటి (అస్సాం)కి అక్కడి నుంచి పట్నా(బిహార్)కు వెళ్లినట్లు గుర్తించారు.
పెళ్లి చేసుకోనని
రాజ్ కుశ్వాహా,సోనమ్ సంబంధం గురించి ఆమె ఇంట్లో వాళ్లకు ముందే తెలుసని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. “రాజ్ తో ప్రేమ గురించి సోనమ్ తల్లికి చెప్పి రఘువంశీని పెళ్లి చేసుకోనని చెప్పింది. కానీ, ఆమె అందుకు అంగీకరించలేదు. బలవంతంగా నా సోదరుడితో పెళ్లికి ఒప్పించారు. అప్పుడు సోనమ్ తన తల్లిని బెదిరించింది. ‘పెళ్లి అయితే చేసుకుంటాను గానీ ఆ తర్వాత అతడిని (రాజా రఘువంశీ) ఏం చేస్తానో చూడు. మీరు అవన్నీ భరించాల్సిందే’ అని సోనమ్ చెప్పినట్లు మాకు తెలిసింది” అని విపిన్ పోలీసులకు తెలిపారు.

క్రైమ్ బ్రాంచ్
ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో సోనమ్ మినహా మిగతా నలుగురు తమ నేరాన్ని అంగీకరించినట్లు ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. రాజా రఘువంశీని చంపే సమయంలో సోనమ్ అక్కడే ఉందని, ఘటనను చూసిందని నిందితులు చెప్పినట్లు తెలిపారు. ఘటన సమయంలో రాజ్ కుశ్వాహా ఇండోర్ లోనే ఉన్నాడు. మిగతా ముగ్గురు ప్రయాణ ఖర్చులకు ఇతడే డబ్బులు సమకూర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
హత్యకు కుట్ర
రాజా రఘువంశీతో పెళ్లి నచ్చని సోనమ్(Sonam) పెళ్లయిన నాలుగు రోజులకే పుట్టింటికి వెళ్లి అక్కడ రాజ్ కుశ్వాహాతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర చేసినట్లు తెలిసింది.ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన సోనమ్ ను షిల్లాంగ్కు తీసుకొచ్చారు. బుధవారం ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు.
Read Also: Uttarakhand: రైల్వే పరీక్ష కోసం వెళ్లిన యువతి నదిలో శవమై తేలింది