తుర్కియేలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్ మేయర్, అధ్యక్ష పదవి రేసులో ముందున్న ఇక్రెమ్ ఇమామోలు అరెస్టు భారీ నిరసనలకు దారితీసింది. ఈ పరిణామం తుర్కియేలో ప్రజాస్వామ్య పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తించింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పీ)లో ప్రముఖ నాయకుడు, ఇస్తాంబుల్ మేయర్, ఇమామోలు ప్రస్తుత అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్దోవాన్‌కు అత్యంత బలమైన ప్రత్యర్థి. ఇస్తాంబుల్ అధ్యక్ష అభ్యర్ధి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, మార్చి 23న ఇమామోలుపై అవినీతి, ఉగ్రవాద సంస్థకు సహాయం చేసినట్లు ఆరోపిస్తూ అధికారులు అరెస్టు చేశారు.
అయితే నిరసనకారులు మాత్రం ఇమామోలు అరెస్టు రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తున్నారు. అధ్యక్షుడు ఎర్దొవాన్ ప్రభుత్వం ఈ వాదనను ఖండించింది. తన అరెస్టుపై స్పందిస్తూ ‘‘ ఇది ప్రజల సంకల్పంపై జరిగిన దాడి’’ అని సోషల్ మీడియాలో రాశారు ఇమామోలు. “వందల మంది పోలీసులు మా ఇంటికి వచ్చారు. ప్రజలకు నేను జవాబుదారిగా ఉంటాను” అని ఆయన అన్నారు.

తుర్కియేకి వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దిష్
1980ల నుండి తుర్కియేకి వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దిష్ జాతీయవాద సంస్థ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)కి సహాయం చేశారనే ఆరోపణలు కూడా ఇమామోలుపై ఉన్నాయి. అయితే, ఈ కేసులో ఆయనకు మళ్లీ అరెస్ట్ వారెంట్ జారీ చేయకూడదని న్యాయమూర్తులు నిర్ణయించారు. తుర్కియే, అమెరికా, బ్రిటన్ దేశాలు పీకేకేను ఉగ్రవాద సంస్థగా గుర్తించి నిషేధించాయి.
నిరసన ప్రదర్శనలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ధిక్కరించి, ఇమామోలు అరెస్టుపై నిరసన తెలుపడానికి వేలమంది వీధుల్లోకి వచ్చారు. ప్రదర్శనకారులలో చాలామంది విద్యార్థులు. వారిలో చాలా మందికి ఒకే వ్యక్తి పాలన తెలుసు. అధ్యక్షుడు ఎర్దొవాన్ 22 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇమామోలును ఎందుకు అరెస్టు చేశారు?
ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీహెచ్‌పీ ప్రాథమిక నాయకత్వ ఎన్నికలు ఇమామోలు అరెస్టుకు కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. సీహెచ్‌పీ ప్రాథమిక నాయకత్వ ఎన్నిక మార్చి 23న జరగాల్సి ఉంది.
2028లో అధ్యక్షుడు ఎర్దొవాన్‌పై పోటీ చేయడానికి ఆయన తన పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవుతారని భావించారు. ఈ పోటీలో ఆయనొక్కరే ఉన్నారు. ఇమామోలుకు ఓటు వేసేందుకు 1.5 కోట్ల మంది ప్రజలు ఆదివారం రాత్రి వరకు క్యూలైన్లలో వేచి చూశారు. ఆయన అప్పటికే పోలీసుల నిర్బంధంలో ఉన్నారు.
అయితే అధ్యక్ష పదవికి ఆయన అభ్యర్థిత్వాన్ని ఇంకా అధికారికంగా నిర్ధరించాల్సి ఉంది.
అభియోగాలను ఖండించిన ఇమామోలు
క్రిమినల్ సంస్థకు సహకరించడం, లంచాలు స్వీకరించడం, దోపిడీ, చట్టవిరుద్ధంగా వ్యక్తిగత డేటాను సేకరించడం, రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలతో ఇమామోలును నిర్బంధించాలని కోర్టు నిర్ణయించినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. తనపై వచ్చిన అభియోగాలను ఇమామోలు ఖండించారు. తన అరెస్టు తుర్కియే ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించిందని పోలీసులతో అన్నారు. కేవలం అరెస్టు కారణంగా అభ్యర్థిత్వం రద్దు కాదు. అయితే, ఆయనపై ఉన్న ఆరోపణలలో ఏదైన ఒక దానిలో దోషిగా తేలినా ఆయన పోటీ చేయలేరు. మరోవైపు ఈ నెల 18న, ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయం ఇమామోలు డిగ్రీని రద్దు చేసింది. తుర్కియే రాజ్యాంగం ప్రకారం, అధ్యక్ష పదవిని చేపట్టబోయేవారు ఉన్నత విద్యను పూర్తి చేసి ఉండాలి. అయితే, ఇమామోలు అభ్యర్థిగా అర్హులా కాదా అన్నది తుర్కియే ఎలక్షన్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది.