Annamaya District : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-రాయచోటి మధ్య రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి (50) మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కలెక్టరేట్ గ్రీవెన్స్ కార్యక్రమానికి రమ వెళ్తుండగా ఈ ప్రమాదం
కాగా, క్షతగాత్రులను రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. మృతిచెందిన డిప్యూటీ కలెక్టర్ రమ.. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్ గ్రీవెన్స్ కార్యక్రమానికి రమ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్..!