మోసం చేసిన
సౌతాఫ్రికాలో ఉండే మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్(56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు డర్బన్‌లోని స్పెషలైజ్డ్ క్రైమ్ కోర్టు తీర్పు వెలువరించింది. లతా రామ్‌గోబిన్‌కు ఎస్‌ఆర్ మహరాజ్ అనే వ్యాపారవేత్తను 6 మిలియన్ రాండ్స్ (రూ. 3.22 కోట్లకు) మోసం చేసిన కేసులో ఈ శిక్ష పడింది. నేరం రుజువుకావడంతో కోర్టు శిక్ష ఖరారు చేస్తూ అప్పీలు చేసుకునే అవకాశాన్నీ నిరాకరించింది. లతా రామ్‌గోబిన్ (Lata Ramgobind) ఒక ఎన్‌జీఓ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తూ తన పలుకుబడిని ఉపయోగించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అసలేం జరిగింది?
లతా రామ్‌గోబిన్ 2015లో ఎస్‌ఆర్ మహారాజ్ అనే వ్యాపారిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్‌గా ఉన్న మహారాజ్‌ను లత డబ్బులు అడిగారు. దీనికోసం లతా రామ్‌గోబిన్ తాను భారత్ నుంచి మూడు కంటైనర్ల ‘లైనెన్’ దిగుమతి చేసుకుంటున్నానని వాటిని దక్షిణాఫ్రికాలోని ప్రైవేట్ హెల్త్‌కేర్ గ్రూప్ నెట్‌కేర్‌కు పంపుతానని నమ్మబలికారు. దిగుమతి సుంకాలు, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డబ్బు కావాలని అడిగారు.అయితే మహారాజ్‌ను నమ్మించడానికి లతా రామ్‌గోబిన్ కొన్ని నకిలీ పత్రాలు చూపించారు. వాటిలో సంతకం చేసిన పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్, నెట్‌కేర్ నుంచి డెలివరీ నోట్ ఉన్నాయి.

సహాయం చేయడానికి
అంతేకాకుండా నెట్‌కేర్ తనకు డబ్బులు కూడా చెల్లించినట్లుగా ఒక బ్యాంకు ధ్రువీకరణ పత్రాన్ని కూడా చూపించారు. వీటికి తోడు లతా రామ్‌గోబిన్ ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె కావడంతో మహారాజ్ (Maharaj) సహాయం చేయడానికి అంగీకరించారు. తనకు లాభాలలో వాటా వస్తుందని ఆశించారు.ఆ పత్రాలన్నీ నకిలీవని తర్వాత తేలింది. అసలు భారత్ నుంచి ఎలాంటి వస్తువులు దిగుమతి కాలేదని తెలిసింది. దీంతో మహారాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (NPA) బ్రిగేడియర్ హంగ్వాని ములాడ్జీ మాట్లాడుతూ లతా రామ్‌గోబిన్, తాను అల్లిన కథను నిజమని నమ్మించడానికి నకిలీ పత్రాలు సృష్టించిందని చెప్పారు. మరో NPA ప్రతినిధి నటాషా కారా లత నకిలీ ఇన్వాయిస్‌లు, ఇమెయిల్‌లను ఉపయోగించి మహారాజ్‌ను మోసం చేసిందని ధృవీకరించారు.
లతా రామ్‌గోబిన్
దీంతో కోర్టు ఆమెను దోషిగా తేల్చి లత అప్పీల్ చేయడానికి చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించింది.2015లో ఆమెకు 50,000 రాండ్ల పూచీకత్తుతో బెయిల్ లభించింది. ఆ సమయంలో లతా రామ్‌గోబిన్ “పార్టిసిపేటివ్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్” అనే కార్యక్రమాన్ని నడిపేవారు. అప్పుడు తాను సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై దృష్టి సారించే కార్యకర్తగా చెప్పుకున్నారు. మరోవైపు, లతా రామ్‌గోబిన్ తల్లి ఈలా గాంధీకి భారతదేశం, దక్షిణాఫ్రికా నుంచి అనేక జాతీయ పురస్కారాలు లభించాయి. శాంతి కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు వచ్చాయి. ఆమె బంధువులు కీర్తి మీనన్, సతీష్ ధూపేలియా, ఉమా ధూపేలియా-మెస్త్రై కూడా సామాజిక సేవ, ఉద్యమాలతో పేరు తెచ్చుకున్నారు.