తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కడప జిల్లాలో జరిగిన మహానాడు (Mahanadu) సభలో కీలక ప్రకటనలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కొన్న ‘ఆపరేషన్ సింధూర్’ తరహాలో, రాష్ట్రంలో ‘ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్’ను చేపట్టి, ఆర్థిక నేరగాళ్లను రాజకీయాల నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఉగ్రవాదులు సమాజానికి ఎంత ప్రమాదకరమో, రాజకీయ ముసుగులో ఉన్న వారు అంతకంటే ఎక్కువ హానికరమని ఆయన అన్నారు.గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జె బ్రాండ్ల మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో ప్రజల ఆరోగ్యాలను నాశనం చేశారని విమర్శించారు. అడవులను ఆక్రమించి ఎస్టేట్‌లు నిర్మించుకున్నారని, కొండలు, చెరువులను కూడా కబ్జా చేశారని ఆయన మండిపడ్డారు. వైకాపా పార్టీ ప్యాలెస్‌ల నుంచి ఎస్టేట్‌ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించిందని, ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
కడప మహానాడుకు అద్భుత స్పందన
కడప శివార్లలో జరిగిన మహానాడు మూడో రోజు బహిరంగ సభకు అపూర్వ స్పందన లభించిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది మే 2న ప్రజాగళం సభలో “కడప రాజకీయం మారుతోంది” అన్న తన మాట అక్షరాలా నిజమైందని గుర్తుచేశారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకుగాను 7 సీట్లు కూటమి గెలుచుకుందని, వచ్చే ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా ధ్వంసమైందని, రూ.10 లక్షల కోట్ల అప్పులు, రూ.1.20 లక్షల కోట్ల బకాయిలు మిగిల్చి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, క్లైమోర్ మైన్‌లకే భయపడని తాను ఇలాంటి సమస్యలకు భయపడనని, అనుభవంతో, మనోధైర్యంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా
సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని, సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ నాంది పలికారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం వివిధ వర్గాలకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు పింఛన్లు అందిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 64 లక్షల మందికి ఏటా రూ.33,000 కోట్లు పింఛన్లకే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి తొలి సంతకం హామీని నిలబెట్టుకున్నామన్నారు. ‘దీపం-2’ కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
బీసీ సంక్షేమానికి పెద్దపీట
తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, వారి అభ్యున్నతికి ఎప్పుడూ పెద్దపీట వేస్తామని చంద్రబాబు అన్నారు. బడ్జెట్‌లో బీసీలకు రూ.47,456 కోట్లు కేటాయించామని, నాయీ బ్రాహ్మణుల వేతనాలు రూ.25 వేలకు పెంచామని, చేనేతలకు జీఎస్టీ రద్దు చేశామని, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయింపు, మత్స్యకారులకు ‘మత్స్యకార భరోసా’ కింద రూ.20 వేల ఆర్థిక సాయం వంటి పలు కార్యక్రమాలను వివరించారు.
యువత, రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట
యువత భవిష్యత్తు కోసమే తాను పనిచేస్తున్నానని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానాలతో రాష్ట్రానికి రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, దేశీయ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో, వృద్ధిరేటులో రెండో స్థానానికి చేరుకున్నామని అన్నారు. రాయలసీమను రాళ్ల సీమగా కాకుండా రాష్ట్రానికి మణిహారంగా తీర్చిదిద్దుతామని, ఇక్కడ ఫ్యాక్షన్‌కు తావులేకుండా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.జూన్ 12 లోగా కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని, రెండు దశల్లో రూ.9,000 కోట్లతో నిర్మించి 6 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామని, గాలేరు-నగరి పనులకు రూ.1,000 కోట్లు తక్షణం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also : Chandrababu Naidu : కోవర్టులను పంపించాలనుకుంటున్నారా : చంద్రబాబు