Kunal Kamra: మద్రాస్ హైకోర్టు స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే పై ఇటీవల కుణాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఏప్రిల్ 7వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కుణాల్ తన షోలో ప్రత్యేకంగా ఎవరినీ ప్రస్తావించలేదని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఈ కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ కుణాల్ తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

వాక్ స్వాతంత్ర్యానికీ, వ్యంగ్యానికీ ఓ హద్దు
ఇటీవల ముంబయిలో కుణాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏక్‌నాథ్ శిందేపై ఓ పేరడీ పాటను ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు దాడి చేసి కార్యక్రమం వేదికను ధ్వంసం చేశారు. దీనిపై ఇటీవల స్పందించిన ఏక్‌నాథ్ శిందే.. కామ్రా వ్యాఖ్యలు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ‘సుపారీ’ తీసుకున్నట్లు ఉన్నాయన్నారు. వాక్ స్వాతంత్ర్యానికీ, వ్యంగ్యానికీ ఓ హద్దు ఉంటుందని పేర్కొన్నారు.