మన జీవితం రోజు ప్రారంభమయ్యేది టీ లేదా కాఫీ తోనే. టీ కోసం పాలు కొనుక్కోవడం అనేది ప్రతి ఇంట్లో జరిగే సాదారణ విషయం. అయితే, ఆ పాలు వాడే సమయంలో విరిగిపోతే..? కొంతమంది మళ్లీ మరో ప్యాకెట్ తెచ్చుకుంటారు. మరికొంతమంది అసహనంతో మనసులోనె మూలుగుతారు.అయితే ఇక నుంచి పాలు విరిగిపోతే గమ్మున ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టొచ్చు. హైదరాబాద్‌లో (Hyderabad) ఓ వ్యక్తి మాత్రం ఆశ్చర్యం కలిగించేలా పాలు విరిగిన విషయం మీద పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టేశాడు.ఈ ఆసక్తికర సంఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే,హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి దగ్గర్లోనే సూపర్ మార్కెట్‌కు వెళ్లి రెండు పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చాడు. ఇంటికి తెచ్చిన ప్యాకెట్లలో ఓ ప్యాకెట్ కట్ చేసి టీ చేసుకున్నారు. మరుసటిరోజు ఉదయం మరో ప్యాకెట్ కాచేసరికి పగిలిపోయాయి.
ఫిర్యాదుతో పోలీసులు
దీంతో ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తి సూపర్ మార్కెట్‌కు వెళ్లి పాలు విరిగిన విషయాన్ని చెప్పాడు. అయితే సూపర్ మార్కెట్ సిబ్బంది సరైన రీతిలో స్పందించలేదు.దీంతో నిరాశ చెందిన బాధితుడు నేరుగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ (Kukatpally Police Station) కు చేరుకున్నాడు. తన వద్ద ఉన్న విరిగిన పాలను ప్యాకెట్‌తో సహా పోలీసులకు చూపించి సూపర్ మార్కెట్ మేనేజర్‌పై ఫిర్యాదు చేశాడు. ‘ఈ పాలు విరిగిపోయాయి. నా డబ్బు వృథా అయ్యింది. నాకు న్యాయం కావాలి’ అంటూ పోలీసులను కోరాడు.పాలు విరగడంపై ఫిర్యాదుతో పోలీసులు మొదట ఆశ్చర్యపోయారు. ఇదొక సాధారణ సంఘటన అని దీనిపై ఫిర్యాదు చేయడం వింతగా ఉందని భావించారు. అయితే, బాధితుడు పట్టు వదలకపోవడంతో పోలీసులు చేసేదేమీ లేక అతని ఫిర్యాదును స్వీకరించారు.

కేసు నమోదు
సూపర్ మార్కెట్ మేనేజర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేపడుతామని చెప్పారు. ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది.కొందరు అతడు చేసిన పనిని హాస్యాస్పదంగా చూస్తుండగా, మరికొందరు వినియోగదారుల హక్కుల (Consumer Rights) పరిరక్షణలో అతని పట్టుదలను ప్రశంసిస్తున్నారు. పాలు విరగడం వంటి చిన్న విషయానికి పోలీసులను ఆశ్రయించడం అరుదైన సంఘటన అయినప్పటికీ వినియోగదారులకు నాణ్యత గల ఉత్పత్తులు అందేందుకు ఇది ఒక మలుపు అని మరికొందరు అంటున్నారు. అయితే ఈ వింత కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.