కేటీఆర్ ధీర్యంగా ముందుకు: ‘‘మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను’’
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను విచారణ కోసం ఏసీబీ అధికారులు పిలవడం తో రాజకీయ వేడి మళ్ళీ పెరిగింది. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావాలని సమాచారం అందినట్టు పేర్కొన్న కేటీఆర్ (KTR), ఈ రోజు ఉదయం పది గంటలకు ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. విచారణకు వెళ్లేముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
విచారణ పేరుతో వేధించడం, తప్పుడు కేసులు నమోదు చేయడం ద్వారా బీఆర్ఎస్ నేతలపై కుట్రలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. ‘‘ఇప్పటికే మూడుసార్లు పిలిచారు, ఇంకో ముప్పైసార్లు పిలిచినా వస్తా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా.. ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను,’’ అంటూ ధీర్యంగా తన స్థానం వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నాయకులపై నిరాధార ఆరోపణలు వేస్తున్నారని విమర్శించారు.

‘‘తప్పుడు కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు’’
విచారణలకు హాజరవడమంటే చట్టాన్ని గౌరవించడమేనని స్పష్టం చేసిన కేటీఆర్, ‘‘మేము చట్టం, న్యాయవ్యవస్థలపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నవాళ్లం. నిజం నిలబడుతుంది. సత్యమే ఎప్పుడూ పైచేయిగా నిలుస్తుంది,’’ అన్నారు. అయితే ప్రభుత్వం తప్పుడు కేసుల ద్వారా తమను కుంగదీస్తామని అనుకుంటే అది విఫలయత్నమని తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన అనుభవం తనకు ఉందని, ప్రజల కోసం పోరాటం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన కేటీఆర్, ‘‘కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్, హరీశ్ రావు లాంటి నాయకులను కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇప్పుడు నన్ను విచారణకు పిలిచి మానసిక సంతోషం పొందుతున్నారు. ఇది చిల్లర రాజకీయాలు,’’ అని విమర్శించారు. విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదని చెప్పారు.
‘‘అరెస్టులకూ, కేసులకూ భయపడే వారు మేము కాదు’’
తాము ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినవాళ్లమని, సత్యం పక్కానున్నప్పుడు అరెస్టుల గురించి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా, ప్రతిపక్షాలను అణచివేయడానికి విచారణల పేరిట వేధింపులకు పాల్పడుతోందని ఆయన అన్నారు. ‘‘మా నాయకత్వం గతంలో ప్రజల కోసం రోడ్డెక్కింది, జైలుపాలైంది. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం,’’ అని కేటీఆర్ స్పష్టంగా ప్రకటించారు.
తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? కేటీఆర్‌ను విచారించిన తర్వాత ఏసీబీ తదుపరి చర్యలేంటన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే కేటీఆర్ ధీర్యంగా స్పందించి తన రాజకీయ స్థిరత్వాన్ని మరోసారి చూపించారని అనుకోవచ్చు.
Read also: KTR : రేపు ఉదయం ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్