ఐపీఎల్ 2025లో భాగంగా, గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో హోరాహోరీగా జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో బెంగళూరు ప్రత్యర్థిని 11 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ప్రత్యర్థులను వారి సొంతగడ్డపై మట్టికరిపిస్తున్న బెంగళూరు చిన్నస్వామిలో హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది.206 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ 194/9 వద్దే ఆగిపోయింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 49, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (34 బంతుల్లో 47, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఆఖర్లో తడబడ్డ రాజస్థాన్‌కు మరో అపజయం తప్పలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 70, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (27 బంతుల్లో 50, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బౌలర్లపై
సొంతగడ్డపై ఆడిన గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్ మెరుగైంది. దూకుడు మీదున్న ఓపెనింగ్ ద్వయం ఫిల్ సాల్ట్ (26), కోహ్లీ ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ 6.4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించి బెంగళూరుకు శుభారంభం అందించారు. ఆర్చర్ మొదటి ఓవర్‌లో కోహ్లీ బౌండరీతో పరుగుల వేటకు శ్రీకారం చుట్టి అతడే వేసిన మూడో ఓవర్లోనూ ఫైన్‌లెగ్, స్కేర్ లెగ్ దిశగా ఫోర్లు కొట్టాడు.తుషార్ 5వ ఓవర్లో సాల్ట్ రెండు బౌండరీలు రాబట్టాడు. పవర్ ప్లే తర్వాత బంతినందుకున్న హసరంగ తన తొలి ఓవర్‌లోనే సాల్ట్‌ను ఔట్ చేయడంతో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. సాల్ట్ నిష్క్రమించినా అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లీ బెంగళూరు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. సందీప్ 12వ ఓవర్లో రెండు ఫోర్లతో కోహ్లీ ఈ సీజన్‌లో ఐదో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.తుషార్ 15వ ఓవర్లో పడిక్కల్ రెండు భారీ సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో కోహ్లీ కూడా ఓ సిక్సర్ బాదడంతో బెంగళూరు ఖాతాలో 22 పరుగులు చేరాయి. ఆర్చర్ 16వ ఓవర్లో కోహ్లీ నితీశ్‌కు క్యాచ్ ఇవ్వడంతో 95 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సందీప్ ఒకటే ఓవర్లో పడిక్కల్, పటీదార్ (1)ను ఔట్ చేసినా ఆఖర్లో టిమ్ డేవిడ్ (23), జితేశ్ శర్మ (20 నాటౌట్) మెరుపులతో బెంగళూరు స్కోరు 200 పరుగులు దాటింది.
బ్యాటింగ్
ఈ మ్యాచ్ విజయం తర్వాత ఆనందం వ్యక్తం చేసిన కోహ్లీ “చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటింగ్ యూనిట్ కలిసి కొన్ని విషయాలు చర్చించుకున్నాం. వాటిని అమలు చేసి మంచి స్కోరు చేయగలిగాం. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ చాలా బాగా సాయపడింది. రాజస్థాన్ రాయల్స్ బాగా ఆడింది. వాళ్లు మంచి షాట్లు ఆడారు. కానీ మేము తిరిగి మ్యాచులో పంజుకుని 2 పాయింట్లు అందుకోవడం ఎంతో కీలకం. ఈ పిచ్ పై టాస్ గెలవడమే మొదటి సవాల్. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కాస్త అనుకూలంగా ఉంటుంది. మునుపటి కొన్ని మ్యాచ్‌ల్లో మంచి స్కోరు చేయాలని కాస్త కష్టపడ్డాం. కానీ ఈరోజు సాఫీగా వెళ్లిపోయింది. ఈ రోజు మా టెంప్లేట్ ఒక ఆటగాడు పూర్తిగా ఇన్నింగ్స్ నిలబెట్టాలి, మిగతావారు ఫ్రీగా ఆడాలి. ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది.”మొదటి 3-4 ఓవర్లలో పేస్,బౌన్స్ ఉంటుంది. అయితే గత 3 మ్యాచ్‌ల్లో మేము బలవంతంగా చాలా షాట్లు ఆడడానికి ప్రయత్నించామని తెలిపారు.
Read Also: IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఓటమి పై స్పందించిన రియాన్ పరాగ్