కుర్చీలో కూర్చుని నిన్నటి నా మెడికల్ రిపోర్ట్స్ తిరగేస్తున్నాను. నాకు అర్థమయిపోతోంది. మందులు తింటే రెన్నెల్లు, తినకపోతే మూన్నెల్లు బతుకుతానని తెలిసిపోయింది. నా వెనుకగా వినవస్తున్న అలికిడితో వెనుదిరిగి అక్కని చూశాను. శూన్యంలో చేతుల్ని అల్లాడిస్తూనే కూచున్న కుర్చీని పట్టుకుంటోందిగానీ వెనుతిరిగిన నన్ను చూడటం లేదు. ఎదురుగా వున్న గోడల మీద నుంచి తన చూపులు జారిపోతున్నాయి. “చిన్నా.. చిన్నా…” అన్న అక్కపిలుపు అమృతాన్ని నా చెవిలో నింపినట్టుంటుంది. “అక్కా.. అక్కా..” నేను అనేప్పుడు నా గొంతులోంచి ఆప్యాయత పెల్లుబికినట్టుంటుంది. “చిన్నా.. నీవు గుండె దిటవు చేసుకో” అక్క “ఎందుకక్కా. ఏమయ్యింది” నాకు. నా రిపోర్ట్స్ అక్క చూడలేదు కదా! నాకు ఆందోళన మొదలయ్యింది. “మొదట నువ్వు దృఢంగా వుండు. ఏమైనా అవనీ.. ఏదైనాగానీ నువ్వు భయపడకుండా వుండు. ఏమాత్రం ఆందోళన చెందకు. బహుశా ఇది తాత్కాలికమే అనుకుంటున్నాను” అక్క నిశ్చలంగా నెమ్మదిగా చెబుతోంది. అక్క ఎందుకంతగా నన్ను దృఢపరుస్తోందో అర్థమవడం లేదు. ఎప్పుడూ నా ముఖాన్ని చూస్తూ ఏదైనా చెప్పే అక్క గోడల్ని చూస్తూ చెప్పడం నాకు బాగనిపించలేదు. అక్క ఏమి చెబితే దానికి నేను వెంటనే సన్నద్ధమవడం చిన్న తనం నుంచి అలవాటైంది. కాదు.. అక్క అలవాటు చేసింది. చిత్తం డృఢమైంది.

అక్క చెప్పే విషయం ఏదైనా ఏమైనా వినడానికి, ఆ స్థితిని ఎదుర్కొనడానికి సిద్ధమయ్యాను. “అక్కా ఇంతగా చెప్పాలా? నేను సిద్ధంగా వున్నాను” కుర్చీలోంచి లేచి నిలుచున్నాను. “ఏం లేదు. చిన్నా… ఇప్పుడే హఠాత్తుగా నా కళ్లకు ఏమీ కనిపించడం లేదు. చీకటి మాత్రమే కనిపిస్తోంది. చిన్నా.. చిన్నా.. నీవు ధైర్యంగా వుండు” అక్క నాకేం చేయాలో అక్కకేం చెప్పాలో తెలియడం లేదు. కారణం.. ఆ స్థితిలోనూ అక్క నన్నే ఓదారుస్తున్న విధానం. అక్క.. అక్క.. అక్కా.. ఓహ్. “అక్కా అక్కా..” అంటూ అక్క చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని కుర్చీలో కూచోబెట్టాను. నా చేతులు వణకడం అక్కకి తెలిసిపోయింది. అక్కచేతులు అప్పుడు చేతులుగా గాక చూపులుగా మారాయని నాకనిపించింది. “చెప్పాను కదా! చిన్నా.. ధైర్యంగా వుండమని” అక్క. అక్క ఎదురుగా కూచున్న నా కళ్లలోంచి నీళ్లు చివుక్కున నా చెంపలపై జారాయి. అక్క నా చెంపల్ని తుడవడం ఆశ్చర్యమనిపించలేదు “అలాగే.. అలాగే.. అక్కా డాక్టర్ దగ్గరకెళదాం. మరేం ఫర్లేదు. నువ్వు ఇట్లా కూచో. ఆటోని తీసుకొస్తా. ధైర్యంగా వుండి. ఏమీ కాదు” నా మాటలు నాకు అక్కముందు మొదటిసారిగా పెద్దగా తోచాయి. ఇంటి బయటకెళ్లి అటుగా వెళుతున్న ఆటోను పిలిచాను అక్క చేయి పట్టుకుని నెమ్మదిగా ఆటోలో కూచోబెట్టాను. అక్క నా చేతుల్ని తడుతోంది. దైర్యంగా వుండమన్నట్టు.. కంటి డాక్టర్ క్లినిక్ ముందు ఆటో ఆగింది.

అక్క చేయి పట్టుకుని ఆటోలోంచి దింపడం.. జీవితమంతా మా చేతుల్ని పట్టుకుని నడిపించిన అక్క.. అక్క.. అక్కా. ఒకరిద్దరు మినహా క్లినిక్లో ఎక్కువ మంది లేరు. విషయాన్ని టోకన్స్ ఇస్తున్న అబ్బాయికి చెప్పాను. డాక్టర్ గదిలోకెళ్లి వచ్చి మమ్మల్ని వెంటనే డాక్టర్ గదిలోకెళ్లమని చెప్పాడు. అక్క కళ్లను పరీక్షిస్తున్నంతసేపూ డాక్టర్ ముఖకవళికల్ని, అక్క వదనాన్ని మార్చి మార్చి చూస్తున్నాను. డాక్టర్ కనుబొమలు పైకి కిందికి కదలడం అప్పుడప్పుడు ముఖకవళికలు మారడం గమనిస్తున్నాను. కానీ అక్క మాత్రం నిశ్చలంగా, వదనంలో ఏ ఆతృత, ఆందోళన లేనితనంతో కూర్చుంది. “సడన్ లాస్ ఆఫ్ విజన్..” కుర్చీలో కూచుంటూ నా వైపు చూసి డాక్టర్ అన్న మొట్టమొదటి మాట. “అంటే..” నాకు అర్థం కాలేదని తెలిసింది డాక్టరుకి. కానీ డిసీజ్ పేరు విధిగా చెప్పడం జరుగుతుంది. పేషెంట్ తాలూకు మనిషికి. “అంటే.. ఉన్నట్టుండి చూపు పోవడం” డాక్టరు. “ఎలా.. ఏ గాయం కాలేదు, ఎక్కడా దెబ్బ తగలలేదు. తలకుగానీ కంటికిగానీ ఎక్కడా.. ఎక్కడా” ఆగాను. “అఫ్కోర్స్! కారణాలు చాలా ఉంటాయి. కీళ్లకి సంబంధించినవి, చర్మ సంబంధమైనవి, రెటీనా డిసార్డర్, ఇంకా.. ఇంకా చాలా” డాక్టరు. “అక్కకి ఎప్పుడూ అలాంటి డిసీజస్ రాలేదు. అసలు తలనొప్పే ఎరగదు” నేను అంటుండగానే- “లోపలున్న రోగం బయట పడితేనే కదా! ఏదేమైనా తెలిసేది రోగం బయట పడనంత వరకు రోగముందని ఏ మనిషికీ తెలియదు.

శరీరంలోని రెసిస్టెన్స్ పవర్ తనలో జనించే రోగాల్ని తనంత తనే క్యూర్ చేసుకుంటుంది. తను రోగాన్ని నయం చేయలేనప్పుడే ఆ రోగాన్ని బయట పెడుతుంది” వివరణనిస్తూ డాక్టర్. “సరే.. మరి అక్కకు ట్రీట్ మెంట్’ నేను ఆతృతతో అడిగాను. “లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. వెంటనే జరగాలి. కానీ ఇక్కడ ఆ వసతులు లేవు. మీరు వెంటనే బెంగళూరుకి తీసుకెళ్లండి. అంతవరకు ఈ ఐడ్రాప్స్ వేస్తుండడండి” డాక్టర్. “డాక్టర్.. ఇది అంత సీరియస్ డిసీజ్ నేను. “ఎస్.. మేబీ” మాటను ఆపాడు, డాక్టరు. కారణం నేను, అర్ధం చేసుకున్నాను. అక్క చెవిన ఆ మాట పడకూడదని తెలుసుకున్నాను.. శాశ్వత అంధత్వం. అక్క నేను క్లినిక్ నుంచి బయటికొచ్చాం. ఆటోలో ఇంటికెళ్లాం. అంబులెన్స్కి ఫోన్ చేశాను, నావి రెండు జతల బట్టలు, అక్కవి రెండు జతలు బ్యాగులో సర్దాను. ఎప్పుడూ ఈ పనులు చేసి ఎరుగను. ఎప్పుడూ మా బట్టల్ని సర్దే అక్క ఎల్లప్పుడూ మమ్మల్ని సరిదిద్దే అక్క. అన్నింటా అక్కే. అన్నీ తానైన అక్క కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అంబులెన్స్ ఇంటిముందు ఆగింది. భార్యకి, కోడలికి విషయాన్ని టూకీగా చెప్పాను. వాళ్ల ముఖాల్లో దిగులు తాండవించడం గమనించాను. కొడుకు రాజేష్ ఆఫీసు పనిమీద హైదరాబాద్ వెళ్లాడు. “రెండు రోజుల్లో తిరిగి వస్తాం. రాజేష్క ఈ విషయం నేను ఫోన్ చేసి చెబుతాను” అంటూ అక్క చేయి పట్టుకుని నడిపించుకుంటూ అంబులెన్స్ లో ఎక్కి కూర్చున్నాం. అంబులెన్స్ కదిలింది.. గతమంతా నాలో మెదలసాగింది.

ఎన్నో వంటల్ని ఒకే బావి నీళ్లు పండించినట్టు వివిధ రకాల పూలమొక్కల్ని ఒకే నేలలో మొలకెత్తించినట్టు, ఒకే కుండలోని నీరుని ఇంటిల్లిపాది తాగినట్టు, ఒక గుమ్మడిపండు కూరను ఇంట్లో అందరూ ఆరగించినట్టు, ఒక కుట్టుమిషన్ ఎన్నెన్నో దుస్తుల్ని కుట్టినట్టు. ఒకే దారిలో ఎందరో నడిచినట్టు, ఒకే వాహనంలో ఎందరో పయనించినట్టు, ఒక వేకువ ఊరంతటిని వెలుగుతో మేలుకొలిపినట్టు, ఒక దేవుణ్ణి అందరూ దర్శించుకున్నట్టు, ఒక దేవతని ఎందరో సందర్శించుకున్నట్టు ఒక్కో ఇంట్లో ఒక్కో వ్యక్తిని చూస్తుంటాం. ఇంటిపని, వంటపని, బయటి పని, వ్యవహారాలూ, కావలసిన వస్తువులూ, చేయాల్సిన పనులూ సర్వం సహా తానై చేస్తూ, అందరి కన్నులకి చూపై ప్రసరిస్తూ, తలలో నాలుకగా ప్రవర్తిస్తూ, అందరి తలపులలో నివసిస్తూ, అందరి పిలుపులకి స్పందిస్తూ, ఎవరికి కావలసినవి వారికి సమకూరుస్తూ, ఎవరికి ఎప్పుడు ఏం కావాలో తెలుసుకొని సమయానికి వారికి సమర్పిస్తూ, తనకేమీ అవసరం లేదన్నట్టు అందరి అవసరాలూ తనే తీరుస్తూ అందరి అవసరాలే తన అవసరాలని అత్యవసరాలనీ త్వరిత గతిన పనులు చేస్తూ వుండటాన్ని ఒక్కో ఇంట్లో ఒక్కో వ్యక్తిలో గమనిస్తుంటాం. అటువంటి వాళ్ల కోవకి చెందిన వ్యక్తే మా అమ్మ. అమ్మా నాన్నలకి అయిదుగురు సంతానంలో పెద్దదైన మా అక్క నా తరువాత ముగ్గురి తమ్ముళ్లకి ఒక చెల్లికి అలనే కాదు.. అమ్మా నాన్నల పాలనలోనూ తనే భాగస్వామి అయ్యేది.

తెల్లవారుఝామున మూడు గంటలకే అక్క మేల్కొనేది(ఈ విషయం నేను పెద్దవాణ్ణయిన తరువాత గమనించాను). నిన్న మిగిలిన అన్నంలో నీళ్లు పోసిన కుండను ఉట్టి మీది నుంచి దించి ఉప్పగళ్లు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అమ్మా నాన్నలకిచ్చేది. వాళ్లు ఆ అంబలిని జుర్రుకుని తాగుతూ. మద్య మధ్యలో ఉల్లిగడ్డను పచ్చిమిర్చిని కొరుక్కుతిని పొద్దుటి పూట కడువు నింపుకుని పరుగులాంటి నడకతో మూడు మైళ్లు ఆవలున్న పొలం దగ్గరికి వెళ్లేవాళ్లు. మా అందరి నిద్రని మెలకువగా చేసుకున్న అక్క మా నిద్రకి ఏమాత్రం నిద్రాభంగం కలిగించక వంటపని మొదలెట్టేది. ఎండిన కట్టెపుల్లల్ని పొయ్యిలోకి దోపుతూ కుతకుత ఉడికే నీళ్లలోకి రాగిపిండిని జారవిస్తూ తెడ్డుతో తిప్పుతూ రాగి సంగటిని చేసే పని దాదాపు రోజూ ఉండేది. ఓ రోజు పప్పుచారు, లేదంటే చెనిక్కాయ ఉర్మిండి ( చట్నీ) చేసేది. ఉదయం మేం లేవగానే పళ్లు తోముకోవడానికి బొగ్గు, ఉప్పు కలిపిన పొడిని మా చేతుల్లో వుంచేది. చిన్న చెల్లిపళ్లు తనే తోమేది. బెల్లంకాఫీలో బొరుగులు(మొరమొరాలు) వేసి తలా ఓ గ్లాసు ఇచ్చి, బడి పుస్తకాలు మా ముందుంచేది. బొరుగులు నములుతూ కాఫీ తాగుతూ మా ఉదయం ఫలహారం ముగించేవాళ్లం. మా అక్కే మాకు ట్యూషన్ చెప్పేది తొమ్మిది గంటలకి మమ్మల్ని స్కూలు దగ్గరికి తీసుకెళ్లి స్కూల్లోకి వెళ్లేంత వరకు కనురెప్పలు కొట్టక చూస్తుండేది. ఓ రోజు అక్కను పెద్దింటి అత్త, పక్కింటి పెద్దమ్మ చిన్నమ్మలు ముస్తాబు చేస్తుంటే మేమందరం కళ్లు వెడల్పు చేసి చూస్తున్నాం.

పైటలో నున్న అక్క చీరతో అగుపించడంతో అక్కని, అమ్మని మార్చి మార్చి చూసుకున్నాం. పైటలో నున్న అక్క చీరలోకి పోగానే అక్క అమ్మగా అగుపించింది. పెద్దదానిలా కనిపించింది. ఆ రోజు ఉదయం పది గంటల – సమయంలో ఎవరో ముగ్గురు ఆడాళ్లు నలుగురు మగాళ్లు, ఒక చిన్నమ్మాయి, అబ్బాయి వచ్చారు. అక్కను చాపపై పరచిన కంబళిపై కూచోబెట్టారు. వచ్చినవాళ్లు అక్కను చూసి ఇంటిపని, వంటపని, అంతో ఇంతో చదువు వచ్చని తెలుసుకొని ముహూర్తాలు పెట్టుకోవడానికి ఎప్పుడు రావాలో మాట్లాడారు. ఆలోగా వాళ్ల వూరు వచ్చి ఇల్లు వాకిలి, పొలం చూడమని అమ్మా నాన్నలి పిలిచారు. ఓరోజు అమ్మా నాన్నా, చిన్నమ్మా చిన్నాయని వాళ్ల ఊరు వెళ్లిరావడం, రాగానే ముహూర్తం పెట్టుకోవడానికి రమ్మని వాళ్లకు తెలపడం, వాళ్లు రావడం, పెళ్లిరోజు, లగ్న సమయాన్ని నాలుగు మూలల పసుపు పూసిన తెల్లకాగితాలపై నీలిరంగు పెన్నుతో పంతులుగారు రాసి ఇరువురికి ఇవ్వడం, ఆ పెళ్లి పత్రాలను ఇరువురూ కళ్లకదుకోవడం పెళ్లిరోజు రానే వచ్చింది. తెల్లని సున్నం పూసిన ఇంటిగోడలు ఇంటిముందు గుయికి కట్టిన కొబ్బరిమండలు, తంగీరు ఆకు అల్లిన పైపందిరి. అవుపేడతో అలికిన భోగిరి, మిలమిల మెరుస్తూ చమ్పీపొడితో వేసిన ముగ్గులు, పల్లె పల్లెంతా ఒకే చోట గుమిగూడడం, ఆదాళ్లందరూ అందంగా అలంకరించుకొని, మగాళ్లంతా తెల్ల ధోవతులతో తెల్ల అంగీపై తువ్వాల్ని హుందాగా వేసుకొని నూతన నడకతో రావడం, పెళ్లికొడుకుని చూసి ఈడుజోడు ‘సరి’ పోయిందని కళ్లతో కొందరు, కనుబొమ్మలతో మరికొందరు, మాటలతో ఇంకొందరు ముసిముసి నవ్వులతో తెలపడం, మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి జరగడం మేమందరం హడావిడిగా తిరుగుతూ భోజనాల సమయంలో అందరి గ్లాసుల్లోకి నీళ్లందివ్వడం జరిగిపోయింది.

ఆ రాత్రి ఆరుబయలు వెన్నెల్లో కూచున్న అక్క బావల్ని చూస్తూ నిద్రలోకి జారిపోవడం జరిగింది. పొద్దున మేం లేవగానే అక్క, బావ, బంధువులు వారి ఊరికి వెళ్లడానికి సమాయత్తమవుతూ మమ్మల్ని వెంట తీసుకెళ్లారు. నాలుగు ఎద్దుల బండ్లలో అందరం కూచున్నాం. ఆరు మైళ్ల ప్రయాణంతో ‘మల్లు’ పెళ్లికి వచ్చాం. సాయంత్రం ముస్తాబు చేసిన ఓ ఎద్దుల బండిలో అక్క బావల్ని కూచోబెట్టి తప్పెట్లు మోగిస్తూ గంతులేస్తూ బాణాసంచా కాలుస్తూ చీకటి పడుతుండగా పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి ఊరంతా ‘మెరవణి’ చేస్తూ తిప్పం అమ్మా నాన్నా నా కళ్లల్లో వెలుగులు చిమ్మాయి. మరుసటి రోజు తిరుగు ప్రయాణంలో అమ్మ, నాన్న, తమ్ముళ్లు, చెల్లాయి వచ్చేశాం. అక్క ఒక్కతే అక్కడే వుండిపోయింది. రెండు రోజుల తర్వాత అక్క, బావ వచ్చారు. అల్లునికి ‘అల్లం’ పది రోజులు ఇంట్లో పిండివంటల జోరు.. ఊరు ఊరంతా వచ్చి అల్లుణ్ణి చూసి మెచ్చుకోవడం నాకు కొత్తగా తోచింది. పది రోజులు గడిచాయి. ఓ ఉదయం అక్క, బావ వాళ్ల ఊరికెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇంటిముందు నిలిచిన ఎద్దులబండిలో ఎక్కి కూచున్నారు. మా అమ్మా నాన్న కళ్లల్లోని తడిని చీరకొంగు తువ్వాలుతో అద్దుకున్నారు. మా చిన్నాన్న చిన్నత్త, నేను బండివెనక ఊరవతల వరకు వెళ్లి తిరిగి వచ్చాం. నెల రోజులు గడిచాయి. అక్కలేని ఇల్లు దీపం వెలగని గుడిగా తోస్తోంది. అక్క పలుకులు లేని పరిసరాలన్నీ మూగపోయిన రాతిగోడలుగా నిలిచాయనిపిస్తోంది.

శరీరంలోంచి గుండెను ఎవరో శాశ్వతంగా తీసుకెళ్లారనిపిస్తోంది. అన్నింటిలోనూ శూన్యం ప్రతిఫలిస్తోంది. జీవితం యాంత్రికతను సంతరించుకోవడంతో నా చూపుల్లో నైరాశ్యం అలుముకుందని తెలుస్తోంది. ఉన్న గదులు రెండు ఎడారిలో దిగులు గుడారాలుగా తోచింది.. రెండు నెలలు దొర్లాయి.. ఓ రోజు అమ్మా నాన్న పొలం నుంచి వచ్చిన పది నిమిషాలకి, బావ ఊరి నుంచి వచ్చిన మనిషి నాన్న చెవిలో ఏదో చెప్పడంతో వున్న ఫళంగా అమ్మా నాన్న బండి తీసుకుని వెళ్లడం మూడు రోజుల వరకు రాకపోవడం జరిగింది. మా చిన్నత్త ప్రతిరోజు ఇంటికొచ్చి మా తిండితిప్పలు చూసేది. కానీ ఆమె కళ్లలోనూ దైన్యం కొట్టొచ్చినట్టు కనపడేది. మాసిన గడ్డంతో, చెదిరిన తలవెంట్రుకలతో నాన్న వచ్చాడుగానీ అమ్మ రాలేదు. ఏమని అడగడానికి అప్పటికి నా వయసూ చాలలేదు. పది రోజుల తరువాత అమ్మ, అక్క వచ్చారు. అమ్మ కళ్లల్లో నీళ్లు ఉబుకుతుండడం, అక్క కళ్లల్లో నిశ్శబ్దం తాండవిస్తుండడం ఏక కాలంలో రెండూ జరుగుతుండడం గమనించడం నా వంతయ్యింది. అక్క నుదిటి పై మిలమిల మెరిసే ఎర్రబొట్టు స్థానంలో నల్లని చీకటి చుక్క అక్క చేతుల్లో తళతళలాడే ఎర్రని గాజుల స్థానంలో బోసిపోయిన చేయి మడమలు, అక్క కళ్లచుట్టూ వుండే నల్లని కాటుక కరిగిపోయి ఎర్రగా కందిపోయిన కనుగడపలు దర్శనమివ్వసాగాయి. ఏమైందని? అడగలేని నా గొంతును బిగబట్టి ఓరోజు మెల్లగా అడుగులేస్తూ అక్క దగ్గరికెళ్లి ఎదురుగా నిలబడ్డాను.

ఒక్కసారిగా అక్క నన్ను హత్తుకుని గుక్కపట్టి ఏడ్చింది. అక్క కళ్లల్లో మునుపెన్నడూ నీళ్లు నేను చూడలేదు. ఈ సమయంలోనే తప్ప మరెప్పుడూ చూడనేలేదు. అక్కకి అవే మొదటి, చివరి కన్నీళుగానే చూడటం. అంతే! ఆ రోజు నుంచి అక్క అంకితభావం మాపై తప్ప వేటిపైనా లేదని ప్రతి క్షణం తెలియజేస్తూనే వుంది. అక్క ఇంటినంతటినీ తనుగా చూసుకుంది. మేం పెరిగి పెద్దయి ఉద్యోగాలు, పెళ్లిళ్లు చేసుకున్నా ప్రతి పనిలో, ప్రతి కార్యంలో తన కారాన్ని కాయాన్ని వనం పెట్టి చేసింది. మా ఉన్నతికి ఆమె పునాదిగా నిలిచింది. గోరుంగా మమ్మల్ని తీర్చిదిద్దింది. అక్క లేకపోతే మేం దిక్కు మొక్కూ లేనివాళ్లయ్యేవాళ్లమని మేం పెద్దయిన తర్వాత తెలిసింది. అమ్మా నాన్నాలు మా చిన్నతనంలోనే కాలం చేయడం, అక్క అమ్మయి, నాన్నయి మమ్మల్ని లోకంలో మనుసులుగా నిలపడం ప్రతి క్షణం మా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. అక్క తమ్ముళ్లలో, చెల్లెలితో నాతో ఒకేలాగున్నా, నేను అక్కతోనే అంకితమవడం జరిగిందని నాకు తెలుస్తుంటుంది. అక్కతో వున్న అనుబంధం లోకంలో ఎవరితోనూ, చివరికి నా పెళ్లాం పిల్లలతోనూ లేదనిపిస్తుంటుంది. అక్క ఇంటికే కాదు.. నా కంటికి దేవతగానే కనిపిస్తుంటుంది. బెంగళూరులో వున్న రెటినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కర్నాటక, బెంగళూరు ఐ హాస్పిటల్ అండ్ రెటినా సెంటర్, ది రెటినా క్లినిక్ రెండు రోజుల్లో చుట్టేసాం. ఎక్కడికెళ్లినా ఒకే ఒక్కమాట.. శాశ్వత అంధత్వం.

జీవితమంతా మా వెలుగు కోసమే మేల్కొన్న అక్కకి శాశ్వత చీకటి మిగలడం జీర్ణించుకోలేకపోతున్నాను. బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో సుళ్లు తిరుగుతున్న ఆలోచనలతో నేను నేనులో లేకున్నాను. రేపటి నుంచి కాదు.. ఈ క్షణం నుంచి అక్కను నేను నా కంటిపాపలా చూసుకోవాలి. లేదా ఇంట్లో ఎవరో ఒకరు అక్కను నిరంతరం చూసుకుంటూనే వుండాలి. అక్కతో నాకున్న అటాచ్మెంట్ వేరు. అక్కతో భార్యా, కోడలు, కొడుకులకున్న దగ్గరితనం వేరు. తేడా కచ్చితంగా ఉంటుంది. సందేహం లేదు. ఇరవై నాలుగు గంటలు అక్కకు తోడుగా నీడగా నేనే వుండక తప్పదు. ప్రతి పనికి నా పనులన్నీ పక్కన పెట్టి వుండాలి. బయటికెళ్లకూడదు. ఉద్యోగాన్ని వదిలేయాలి. అంతేకాదు, ఎక్కడికీ వెళ్లడమన్నది వుండకూడదు. ఇంట్లోనే – అక్కతోనే శాశ్వతంగా వుండాలి. ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ నా కోసం మా కోసం తన జీవితమంతా ఇచ్చిన అక్కకు నేను ఈ మాత్రం ఇవ్వలేనని అనుకోవడం లేదు. ఉద్యోగాన్ని వదిలేయడానికి నాకేమీ కించిత్ సందిగ్ధం లేదు. అక్క చూపిన చేసిన దానికి నేను ఏం చేసినా తక్కువే. పరిష్కారం.. పరిష్కారం.. ఇంతకన్నా వేరేమీ లేదనిపించింది. ఒక్క రోజుతో పోయేదీ కాదనిపించింది. అంబులెన్స్ ఊరు సమీపిస్తోంది. ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఆలోచన తట్టింది. అంబులెన్ను ఊళ్లో మునుపు అక్కని చూసిన డాక్టర్ దగ్గరికి మళ్లించమని డ్రైవర్కి అడ్రస్ చెప్పాను.

క్లినిక్లో ఎవరూ లేరు. అక్కని వెయిటింగ్ హాల్లో కూచోబెట్టాను. డాక్టరు దగ్గరికి వెళ్లి కూచున్నాను. “యస్.. వెళ్లి వచ్చారా? ఏమన్నారు” డాక్టరు. విషయం చెప్పాను డాక్టరుకి. శాశ్వత అంధత్వం అనే మాట అక్కకి వినిపించకుండా.. డాక్టర్ మౌనంగా విన్నాడు. “పరిష్కారం.. మీరు చెప్పండి డాక్టరు.. నాకేమీ తోచడం లేదు” అన్నాను. “ఎవరైనా నేత్రదానం చేస్తే సరిపోతుంది” డాక్టరు మెల్లిగా చెప్పాడు. “ఎవరు చేస్తారు.. ఎవరినడగాలి” అన్నాను. “నేత్రదానం చేసే వాళ్లెవరైనా చనిపోతే వారి నుండి నేత్రదానం పొందవచ్చు. టైం పట్టొచ్చు. అంతదాకా ఆగాల్సిందే” డాక్టర్ అంది. “నా కళ్లు రెండూ అక్కకి ఇవ్వచ్చు కదా! డాక్టర్ వేరేవాళ్లే కళ్లెందుకు” అన్నాను. డాక్టరు కుర్చీలో నిటారుగా కూచుని నా వైపు చూస్తూ “వాడ్డుయూ మీన్! బతికినవాళ్ల కళ్లు తీసుకోరు” డాక్టరు. “డాక్టర్.. నాకో ఆలోచన వచ్చింది. నాకున్న రెండు కళ్లూ అక్కకి అమరిస్తే నేను అంధుణ్ణి ఓ మూల కూచోవాల్సిందే. ఒకరిపై ఆధారపడాల్సిందే. నిరంతరం నన్ను వెన్నంటి ఒకరు వుండాల్సిందే. అప్పుడు అక్కకు నాకు తేడా లేకుండా పోతుంది. నేను అక్కని చూసుకున్నట్టు అక్క అన్నింటినీ విడిచి నన్ను చూసుకోవాల్సి వస్తుంది. అందుకని నాకున్న రెండు కళ్లలో ఓ కన్నుని అక్కకు అమరిస్తే అక్కకున్న సమస్య తీరుతుంది. నాకూ ఏ అదనపు బాధ్యత వుండదు. ఎవరి పనులు వారు చేసుకునే వీలుంది. ఒకరిపై ఒకరు ఎవరిపై ఎవరు నిరంతరం ఆధారపడాల్సిన అవసరం జీవితాంతం వుండదు. ఇన్నాళ్లూ మా కళ్లకు చూపులిచ్చిన అక్కకు నాలోని ఒక కన్ను ఇవ్వడం. అదీ నా కన్ను ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తాను. అక్కకు జీవితంలో ఏమీ ఇవ్వని నాకు కన్ను ఇచ్చి చిన్న రుణం తీర్చుకున్నవాణ్ణవుతాను” ఉద్వేగంతో చెబుతున్న నన్ను డాక్టర్ ప్రశాంతంగా చూస్తున్నాడు. “మార్వలెస్.. మీ స్పందనకి నేను జస్టిస్నై వుంటే తక్షణం అమలు చేయమని ఆర్డినెన్స్ పాస్ చేసేవాణ్ణి.

కానీ బతికున్నవాళ్లలోని రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని తీసుకున్నట్టు రెండు కళ్లల్లో ఒక కన్ను తీసుకునే సిస్టం ఇంకా రూపుదిద్దుకోలేదు. అంతేకాదు.. ఒక కన్ను తీస్తే రెండో కన్ను దెబ్బ తింటుంది. రెండు కన్నులకి ఇంటరాక్టివ్ ఆక్టివ్నెస్ ఒకటే ఉంటుంది. వైద్యశాస్త్రంతో పాటు న్యాయశాస్త్రం కూడా వొప్పుకోదు” డాక్టరు. “ఒకే కన్నుతోనే జీవితాంతం గడుపుతున్న వాళ్లెందరినో చూస్తున్నాం కదా డాక్టర్” “పుట్టుకతోనే అది ముడిపడి వుండాలిగానీ, పెద్దయిన తర్వాత రెండు కళ్లలో ఒక కన్ను దెబ్బ తిన్నా, చూపు పోయినా, దెబ్బ తిన్నా చూపు కోల్పోయినా కన్నుని తొలగించరు. కారణం ఒక ఒకదానికొకటి సంబంధంతో వుండి చూపును సరిచేస్తుండడమే కారణం” అన్నాడు, డాక్టర్. “ఎలాగైనా సరే… నా కన్నుల్లో ఒకటి అక్కకి” ఆపాను. “వీలు కాదు. ఎవరైనా మృతి చెందిన ఐ డోనర్ దొరికేవరకు మీ అక్క కళ్లకి చూపు చేకూర్చడం కుదరని/జరగని పని” డాక్టర్ ప్రశాంతంగా చెప్పాడు. ఆ క్షణం నా కన్నుని ఇస్తానన్నా తీసుకోని వైద్యశాస్త్రాన్ని అభివృద్ధి పరిచేవాళ్లు లభిస్తే బాగుండుననిపించింది. న్యాయశాస్త్రం వెంటనే స్పందిస్తే సరిపోతుందనిపించింది. ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికి వచ్చాను. అక్కని ఇంట్లో దిగవిడిచి హాస్పిటల్కి వచ్చి ఐడోనర్గా పేరు నమోదు చేసుకున్నాను. ఎవరికివ్వాలో కూడా అందులో తెలియజేశాను. కళ్లలోని చూపును వేళ్లతో లాగి అంకిత భావంతో సంతకం చేసాను. వైద్య, న్యాయ శాస్త్రాల కంటే మునుపే మనిషి అనేవాడున్నాడని నిరూపించాను. రెండు నెలల లోపలే అక్క కళ్లల్లో చూపునై నిలిచాను.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: