Gold treasure in well:ఆశాపురం ప్రజలు మంచినీళ్లు లేక కరువుతో అల్లాడుతున్నారు. చెరువులు ఎండిపోయాయి. మంచినీళ్లు తాగేందుకు ఒక బావి కూడా ఆ ఊళ్లో లేదు. పాలకులు తమను పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శలు కురిపిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగారు. పాలకుల నుండి అయాచితంగా వచ్చే పథకాలను అనుభవిస్తూ చాలా మంది సోమరుల్లా (Lazy) తయారయ్యారు. ఆ గ్రామానికి చెందిన చైతన్య విదేశాలలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని గ్రామానికి వచ్చాడు. మంచినీళ్ల కోసం గ్రామ ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్తుండడం చైతన్య గమనించాడు. ఈ సమస్యకు (problem) పరిష్కార మార్గం వెతికేందుకు యువతను సమావేశపరిచాడు.
“గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి మనమే ఒక బావిని తవ్వుకుందాం” అన్నాడు చైతన్య. అది పాలకుల పని. మనం దానిని తవ్వితే ఆ ఖర్చును ఎవరు భరిస్తారు? పాలకులే ఆ ఖర్చును భరించి మన సమస్యకు పరిష్కారం చూపాలి” అన్నాడో పెద్దమనిషి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మనం ఎంత కాలం ఎదురుచూస్తాం బాబాయ్. విదేశాల్లో చదువుకుంటూ దొరికిన ఖాళీ సమయాల్లో ఏదో ఒక పని చేసి కొంత డబ్బు కూడబెట్టాను. బావి తవ్వే ఖర్చును నేను భరిస్తాను. మనమే దానిని తవ్వుకుందాం. బావిని తవ్వడానికి నాకు కొందరు యువకులను అప్పగించండి. వారికి రోజువారీ కూలీ ఇచ్చి దానిని తవ్విస్తాను” అన్నాడు చైతన్య.
అయాచితంగా వచ్చే పథకాలను ఉపయోగించుకుని పని చేయడం మానేసి సోమరిపోతుల్లా మారిన యువకులెవరూ బావిని తవ్వడానికి ముందుకు రాలేదు. చైతన్య చాలా ప్రయత్నించాడు. రెట్టింపు కూలీ ఇస్తానని ఆశ చూపినా ఎవరూ ముందుకు రాలేదు. చైతన్య ఒక్కడే కొద్ది రోజులు కష్టపడి బావిని తవ్వాడు. కానీ నీళ్లు పడలేదు.

అతి పెద్ద బండరాయి బయటపడింది. ఆ బండరాయిని తొలగిస్తే బావిలో నీళ్లు పడతాయని, తనకు సాయం చేయమని చైతన్య చాలా మందిని బతిమిలాడాడు. అందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చేసేది లేక చైతన్య దిగాలుగా బావి వద్ద కూర్చున్నాడు. అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
మరుసటి రోజు ఊళ్లో చురుకుగా ఉంటే అయిదుగురు పిల్లలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఒక్కో బంగారు నాణెం ఇచ్చాడు చైతన్య.
“బావిలో బయటపడిన బండ చుట్టూ ఈ బంగారు నాణేలు దొరికాయి. ఆ రాయి కింద బంగారు నిధి ఉన్నట్లు నేను కనిపెట్టాను.

ఈ రాత్రికి నేను బండను తొలగించి దాని కింద వున్న బంగారు నిధిని సొంతం చేసుకుంటాను” అని పిల్లలకు చెప్పాడు చైతన్య. ఈ విషయాన్ని పిల్లలు ఊరంతా చెప్పారు. అది విన్న కొందరు యువకులు బావిలోని బంగారు నిధిని సొంతం చేసుకోవాలని పోటాపోటీలుగా పలుగులు, పారలు తీసుకుని వెళ్లి చాలా శ్రమకోర్చి ఆ బండరాయిని పగులగొట్టారు. అక్కడ వారికి బంగారు నిధి దొరకలేదుగానీ పెద్ద జలపాతం వచ్చింది. నీళ్లు ధారాపతంలా పెల్లుబికి పైకి వచ్చాయి.

యువకులు నిరాశ చెంది చైతన్య ముందర సిగ్గుతో తల దించుకున్నారు. బావిలో నీటిజలకు అడ్డుగా ఉన్న రాయిని తొలగించడానికి ఇదంతా చైతన్య ఆడిన నాటకమని వారికి అర్థమైంది. బావిలో మంచినీరు పడటమే అసలైన బంగారు నిధి అని భావించిన గ్రామస్తులంతా సంతోషించారు. తన ఎత్తుపారినందుకు చైతన్య ఆనందపడిపోయి ఉద్యోగ ప్రయత్నంలో నగరానికి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి యువకులంతా ఎవరో వచ్చి గ్రామానికి మేలు చేస్తారని ఎదురు చూడకుండా, అయాచితంగా వచ్చే సొమ్ముకు ఆశపడకుండా కష్టపడి పని చేసి తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు.
Read also:hindi.vaartha.com
Read also: