దేశ రక్షణ వ్యవస్థలో సమన్వయం, సమైక్యతను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సమిష్టి చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్‌కు ఒకే ఆదేశాల జారీ చేసే అధికారం అప్పగించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు వేర్వేరు శాఖలుగా ఉన్న దళాలు, ఉమ్మడి ఆదేశాలకై ఒక కేంద్ర బిందువుగా CDSను ప్రాముఖ్యతతో చూస్తున్నారు.
ఉమ్మడి ఆదేశాలు, ఉమ్మడి సూచనలు
ఈ సంస్కరణతో “ఉమ్మడి ఆదేశాలు, ఉమ్మడి సూచనలు” అనే ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది. దీని ద్వారా కార్యాలయ పరిపాలన సరళీకరణ, అనవసర నిర్ణయాల తొలగింపు, మూడు దళాల మధ్య అవగాహన పెంపు వంటి ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ చర్య సాయుధ దళాల ఆధునికీకరణలో కీలక మైలురాయిగా నిలవనుంది. ఇది దేశ భద్రతా వ్యవస్థలో ఒక నూతన శకానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు.
దేశ భద్రతా వ్యూహాన్ని భౌగోళిక విభజన
ఈ చర్య థియేటరైజేషన్ మోడల్ అమలులో భాగంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ నమూనాలో దేశ భద్రతా వ్యూహాన్ని భౌగోళిక విభజన ఆధారంగా రూపొందించి, ప్రతి థియేటర్ కమాండ్‌లో మూడు దళాలకు చెందిన విభాగాలు కలిపి ఒకే కమాండ్ కింద పని చేస్తాయి. ఈ విధానం యుద్ధ సమయాల్లో వేగవంతమైన చర్యలు తీసుకోవడానికి, వనరుల సమర్ధవంతమైన వినియోగానికి దోహదపడుతుంది. త్రివిధ దళాల ఏకీకరణతో పాటు, కార్యాచరణలో స్పష్టత, సమైక్యతను పొందే దిశగా కేంద్రం వేసిన ఈ అడుగు, రక్షణ రంగ అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also : Family Man 3: ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్