తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం 11:00 గంటలకు శాసనసభలో 2025-26 ఆర్థిక రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్. భట్టి విక్రమార్క సభలో ప్రసంగిస్తు కీలకమైన ఆర్థిక కేటాయింపులు అలాగే కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ బడ్జెట్ కీలక కేటాయింపులు అలాగే ప్రాధాన్యతలు : ఫ్యూచర్ సిటీకి రూ.100 కోట్లు, గ్రామాల్లో 100 శాతం సౌర విద్యుత్‌కు రూ.1500 కోట్లు, తెలంగాణలో నిరుద్యోగం రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గిందని సభలో ఉపముఖ్యమంత్రి అన్నారు. అయితే ఈ ఏడాది 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో
మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 2024 మార్చి నెలలో ప్రారంభించి ఇండ్ల పట్టాలను మహిళల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాక 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల (4,50,000) ఇండ్లను మంజూరు చేస్తాం అని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక నీటి పారుదుల శాఖకు 23,373 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 5,907 కోట్లు, పర్యాటకశాఖ కు 775 కోట్లు, క్రీడా శాఖకు 465 కోట్లు, ఫారెస్ట్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ 1,023 కోట్లు, దేవాదాయశాఖకు 190 కోట్లు, హోంశాఖకు 10,188 కోట్లు కేటాయించారు. ఐటీ శాఖకు 7,704 కోట్లు, వైద్య ఆరోగ్యశాఖకు 12,393 కోట్లు, విద్యుత్ శాఖకు 21,221 కోట్లు, హై టెక్ సిటి డెవలప్మెంట్‌కు 150 కోట్లు, MA & UD శాఖకు 17,677 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కు..
పంచాయతీ రాజ్ శాఖకు రూ.31,605 కోట్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్- రూ.433 కోట్లు, 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు సహా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.11,600 కోట్లు, బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను 38 కాలేజీల్లో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పేద, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య శ్రీ పరిధి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు చేసారు. దీనికి తోడు కొత్తగా 1835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేర్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సామాజిక అభివృద్ధిలో విద్య పాత్రను నొక్కిచెబుతూ పేద పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించడంలో విద్య కీలకమని పేర్కొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య దార్శనికతను సాకారం చేసుకునేందుకు మనం దగ్గరగా ఉన్నాము. రాష్ట్రవ్యాప్తంగా 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి రూ. 11,600 కోట్లు మంజూరు చేయడం ద్వారా మా ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది అని ఆయన ప్రకటించారు.