ఒకప్పుడు విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచి టీడీపీలో కొనసాగిన కేశినేని నాని ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతే కాదు తనకు రెండుసార్లు టికెట్ ఇచ్చి గెలిపించిన చంద్రబాబు, లోకేష్ పైనే నిప్పులు చెరిగారు. తిరిగి వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయవాడలో హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో ఓ రేంజ్ లో వీచిన కూటమి గాలిలో తమ్ముడు కేశినేని చిన్ని చేతిలోనే ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.
పురందేశ్వరితో కేశినేని నాని మంతనాలు
అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో కేశినేని నాని టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక బీజేపీ నేతల్ని కలవడం, జాతీయ నేత గడ్కరీని సందర్భం వచ్చినప్పుడల్లా పొగడటం చూసి ఆయన కాషాయ గూటికి చేరిపోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన ప్రజాసేవ కొనసాగుతుందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రజల సంక్షేమం కోసం కృషి
ఇటీవలి మీడియా ఊహాగానాలకు ప్రతిస్పందనగా తన రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి తన వైఖరిని స్పష్టం చేస్తున్నానంటూ కేశినేని ఓ ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించానని, ఆ నిర్ణయం మారదని కేశినేని నాని తెలిపారు. అయితే, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను హృదయపూర్వకంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని కేశినేని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
అంకితభావంతో ..
సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదన్నారు. కానీ విజయవాడలోని తన తోటి పౌరుల శ్రేయస్సు కోసం తన లోతైన అంకితభావంతో ముడిపడి ఉందన్నారు.
తన రాజకీయ పునరాగమనానికి సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్తలను పట్టించుకోవద్దని ఆయన అందరినీ కోరారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, దాని ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే తన దృష్టి ఉందన్నారు. తన ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదే అభిరుచి, నిబద్ధతతో తన సేవను కొనసాగించడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.