మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా తిరిగి యాక్టివ్ కానున్నారు. జిల్లాల పర్యటనలు.. భారీ బహిరంగ సభలకు సిద్దం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ రాజకీయం గా మౌనం పాటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసినా.. పార్టీకి ఒక్క సీటు దక్కలేదు. ఆ తరువాత పార్టీ నేతలతో అప్పుడప్పుడూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ఒక్క సారి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. ఇక, తాజాగా తిరిగి రాజకీయంగా ప్రజల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 19న కేసీఆర్ పార్టీ నేతల తో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
ప్రతి పక్ష పార్టీలే లక్ష్యంగా
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ ప్రతి పక్ష పార్టీలే లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశ గా కసరత్తు కొనసాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పెండింగ్ పథకాల అమలు పైన నిర్ణయం ప్రకటించనున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఇక రాజకీయంగా యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. కొత్త కార్యాచరణ తో రేవంత్ టార్గెట్ గా రంగంలోకి దిగేందుకు సిద్దం అవుతు న్నారు. అందులో భాగంగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

25 ఏళ్లు పూర్తి కానున్న టీఆర్ఎస్ ఆవిర్భావం
టీఆర్ఎస్ ఆవిర్భవించి ఈ నెల 19వ తేదీకి 25 ఏళ్లు పూర్తి కానుంది. 2023 లో టీఆర్ఎస్ కొత్త పేరుతో బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. దీంతో, ఈ సారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేదికగా కొత్త కార్యాచరణ ప్రకటించేందుకు కేసీఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుండటంతో.. ఇక రాజకీయంగా దూకుడు పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూనే.. ప్రజల్లో ప్రభుత్వం పైన అభిప్రా యం గురించి తాను నిర్వహించిన సర్వే నివేదికలను కేసీఆర్ వెల్లడించనున్నారు. ప్రతిపక్ష పాత్ర లో ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యాచరణ పైన కేసీఆర్ ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటనలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దంగా..
ఇక, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల భవిష్యత్ పైన కొత్త చర్చ మొద లైంది. కోర్టులో కేసు కీలక దశకు చేరుకోవటంతో ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ మొదలైంది. 19న జరిగే సమావేశంలో హాజరయ్యే వారి గురించి బీఆర్ఎస్ లో చర్చ మొదలైంది. స్థానిక సంస్థ ల ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీ పరంగా సిద్దంగా ఉండేలా కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. అదే విధంగా కామారెడ్డి, వరంగల్ కేంద్రంగా రెండు భారీ సభలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ద్వారా కేసీఆర్ తీసుకునే నిర్ణయాల పైన పార్టీలో ఆసక్తి కనిపిస్తోంది.