తెలంగాణలో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా మారుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలోనే తన శస్త్రచికిత్స చేయించుకోవడమే కాదు, అక్కడి వైద్యులపై నమ్మకంతో చికిత్స పూర్తి చేయించుకోవడం ద్వారా ఆమె ప్రభుత్వ వైద్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తావించి, ఆమెను అభినందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.వివరాల్లోకి వెళితే, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
ఆధునిక సదుపాయాలు
ఈ క్రమంలో, ఆమె నిన్న కరీంనగర్‌లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) విభాగానికి చెందిన నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు విజయవంతంగా ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీలను నిర్వహించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈరోజు ఎక్స్ వేదికగా స్పందించారు. “ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు ఉన్నారు. సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం ప్రజలందరిలో కలగాలి.ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు” అని తన పోస్టులో పేర్కొన్నారు.

అపోహలు తొలగిపోవచ్చు
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవడం ద్వారా ప్రజల్లో వాటిపై విశ్వాసం పెరుగుతుందని, కలెక్టర్ పమేలా సత్పతి (Collector Pamela Satpathy) చర్య ఇందుకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం.సామాన్యులకు కూడా సర్కారు వైద్యంపై భరోసా కల్పించే దిశగా ఒక మంచి పరిణామంగా భావిస్తున్నారు.కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ఈ చిన్న నిర్ణయం, ప్రభుత్వ వైద్య రంగంపై మంచి సందేశాన్ని ఇచ్చింది. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల ఉన్న అపోహలు తొలగిపోవచ్చు. అధికారుల చొరవ, ప్రభుత్వ వైద్యుల నైపుణ్యం సమ్మిళితమై ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందించగలమన్న విశ్వాసం బలపడుతుంది.