అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల గ్రీన్ కార్డు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు ఉండదని స్పష్టం చేశారు. ఇది వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించిన అంశం కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశమని తెలిపారు. అమెరికా పౌరులుగా ఎవరిని విలీనం చేసుకోవాలో నిర్ణయించే హక్కు అమెరికన్లకే ఉందని వాన్స్ పేర్కొన్నారు.
గ్రీన్ కార్డు – శాశ్వత నివాస హామీ కాదు
అమెరికా గ్రీన్ కార్డు అనేది శాశ్వత నివాస అనుమతి కోసం ఇచ్చే అధికారిక డాక్యుమెంట్. అమెరికా పౌరసత్వానికి దారితీసే తొలి అడుగు గ్రీన్ కార్డు అని చాలా మంది భావిస్తారు. అయితే, గ్రీన్ కార్డు కలిగి ఉన్నంత మాత్రాన ఎల్లప్పుడూ అమెరికాలో ఉండే హామీ ఉండదని వాన్స్ స్పష్టం చేశారు.

గ్రీన్ కార్డు రద్దు చేసే సందర్భాలు
అమెరికా చట్టాల ప్రకారం, కొన్ని పరిస్థితులలో గ్రీన్ కార్డు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం అమెరికాలో లేకపోవడం – ఒక గ్రీన్ కార్డు హోల్డర్, ఏటా గరిష్టంగా 6 నెలల పాటు మాత్రమే అమెరికా బయట గడపాలి. ఎక్కువ కాలం అమెరికా బయట గడిపితే, ప్రత్యావాస రద్దు (Abandonment of Residence) నిబంధనల కింద గ్రీన్ కార్డు రద్దవుతుంది.
నేరాలకు పాల్పడటం – తీవ్రమైన నేరాలు (felony crimes) లేదా డ్రగ్స్, మనీ లాండరింగ్, మోసం, హింసాత్మక నేరాలకు పాల్పడినట్లయితే, గ్రీన్ కార్డు రద్దు చేసే అధికారం ప్రభుత్వం కు ఉంటుంది. అమెరికా వలస చట్టాలను ఉల్లంఘించిన ఏదైనా చర్యలు గ్రీన్ కార్డు కోల్పోవడానికి దారి తీస్తాయి.
అమాయకమైన తప్పిదాలు కూడా ప్రభావం చూపొచ్చు – రెసిడెన్స్ ప్రూఫ్ లో పొరపాట్లు, పౌరసత్వ ప్రక్రియలో తప్పుడు సమాచారాన్ని అందించడం వంటివి కూడా సమస్యలకు దారి తీస్తాయి. అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డును ప్రవాసులకు శాశ్వత నివాస అనుమతి ఇవ్వడానికి ఉపయోగిస్తుందని స్పష్టంగా పేర్కొంది.