ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన పార్టీకి చెందిన కొంత మంది నేతలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధికారానికి అండగా, స్థానిక స్థాయిలో ఆచితూచి వ్యవహరించాల్సిన నాయకులు మరింత రెచ్చిపోతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తన పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల ఒక మహిళా డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళా డాక్టర్‌ను పట్టు విడవకుండా అనుచితంగా మాటలాడటమే కాకుండా, వార్నింగ్ ఇవ్వడం జనసేన నేతకు తీవ్రమైన పరిణామాలను తీసుకువచ్చింది. తమ్మయ్య బాబు తన అనుచరుడితో కలిసి ఆసుపత్రికి వెళ్లినప్పుడు, అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులు చికిత్స పొందుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తన అనుచరుడు డాక్టర్ శ్వేతతో మాట్లాడించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆమె తమ్మయ్య బాబును గుర్తుపట్టలేదు. దీంతో తమ్మయ్య బాబు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.

డాక్టర్ సిబ్బందికి వార్నింగ్
ఆస్పత్రికి వెళ్లిన తమ్మయ్య బాబు, నేనెవరో తెలియదా? అంటూ డాక్టర్‌ను హేళన చేశారు. ప్రజల సొమ్ము తీసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయండి అంటూ హెచ్చరించారు. అతని అనుచరులు ఆసుపత్రి సిబ్బంది వీడియో తీస్తుండగా, ఫోన్ లాక్కొని డిలీట్ చేయించారు. ఈ ఘటన అనంతరం ఆసుపత్రి సిబ్బంది నిరసనగా విధులు బహిష్కరించారు. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది జనసేన నేతపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకూ వెళ్లింది. ఒక మహిళా డాక్టర్‌ను బెదిరించడం సరికాదని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ్మయ్య బాబును జనసేన పార్టీ బాధ్యతల నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు పరువు తీయకూడదనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఎలాంటి వెనుకడుగు వేయలేదు. తమ్మయ్య బాబును పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జనసేన నేతలకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తగిన చర్య తీసుకున్నారు. మరికొందరు నేతలు కూడా ఇలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అని కొందరు చెబుతున్నారు. అయితే, జనసేనలో మరికొంత మంది ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అందరికీ ఇదే శిక్ష అమలు చేయాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనతో జనసేన పార్టీ తన నేతల ప్రవర్తనపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీ పరువుకు మచ్చతగలేలా వ్యవహరించే వారిపై భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.