గుట్కా, పాన్ పరాగ్ వంటి నమిలే పొగాకు ఉత్పత్తులు ఎంత ప్రాణాంతకమో చెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రకటనలు రూపొందించి ప్రదర్శిస్తూ ఉంటుంది. దేశంలో గుట్కా, తంబాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం అమలు చేస్తున్నా సరే.. వాటి వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సినవారే గుట్కాలు, పాన్ మసాలాలు నములుతూ ఎక్కడపడితే అక్కడ ఉమ్ముతున్నారు. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఈ గుట్కా ఉమ్ములతో ఏర్పడ్డ మరకలే దర్శనమిస్తుంటాయి. అందమైన పరిసరాలను ఉమ్ములతో అపరిశుభ్రం చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీని సైతం వదలకుండా గుట్కా నమిలి ఉమ్మేశారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
స్పీకర్ సతీశ్ మహానాకు ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సెషన్ 9వ రోజు (మంగళవారం) ఓ దృశ్యం అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానాకు ఆగ్రహం, అసహనం తెప్పించింది. ఆయన సభకు హాజరయ్యేందుకు లోపలికి వెళ్తున్న క్రమంలో అసెంబ్లీ లోపల కార్పెట్ మీద గుట్కా నమిలి ఉమ్మిన మరకలను గుర్తించారు. వెంటనే సిబ్బందిని పిలిపించి శుభ్రం చేయించారు. సభ ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ఆ చర్యకు పాల్పడిన ఎమ్మెల్యేను హెచ్చరించారు.
చురకలు అంటించిన స్పీకర్ సతీశ్ మహానా
“మన సహచర సభ్యుల్లో ఒకరు ఈ పని చేశారు. ఇది మనందరి సభ. దాన్ని పరిశుభ్రంగా, గౌరవప్రదంగా ఉంచడం మనందరి బాధ్యత. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని సీసీటీవీ కెమేరా ద్వారా గుర్తించాను. ఆ సభ్యుడు తనంతట తానుగా ముందుకొచ్చి తప్పును అంగీకరిస్తే ఫర్వాలేదు. లేదంటే నేనే అతడికి ఫోన్ చేయాల్సి ఉంటుంది” అంటూ స్పీకర్ సతీశ్ మహానా అన్నారు. ఉమ్మివేసిన ఎమ్మెల్యే పేరును స్పీకర్ ప్రకటించకుండా ఈ చురకలు అంటించారు. మరోసారి ఇలాంటి తప్పు పురనావృతం కావద్దని ఆయన అన్నారు.