ఇరాన్(Iran)పై జూన్ 13న ఇజ్రాయెల్(Israel) దాడి చేసిన తర్వాత, హార్ముజ్ జలసంధిని మూసివేస్తారనే ఆందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, చమురు సరఫరాకు ఈ జలసంధి ముఖ్యమైనదే కాక, వ్యూహాత్మకమైనది కూడా. పశ్చిమాసియాలోని సంపన్న చమురు దేశాలను ఆసియా(Asia), యూరప్(Europe), ఉత్తర అమెరికా(North America) సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను హార్ముజ్ జలసంధి కలుపుతుంది. కానీ ఈ ప్రాంతం దశాబ్దాలుగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు, వివాదాలకు కేంద్రంగా ఉంది. హార్ముజ్ జలసంధి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకునే ముందు, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా, సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పెరిగాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. సోమవారం ఆసియా మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభం కాగానే, బ్రెంట్ ముడి చమురు ధర రెండు డాలర్లు లేదా 2.8 శాతం కంటే ఎక్కువ పెరిగి బ్యారెల్‌కు 76.37 డాలర్లకు చేరుకుంది. అమెరికా ముడి చమురు ధర కూడా బ్యారెల్‌కు దాదాపు రెండు డాలర్లు పెరిగి 75.01 డాలర్లకు చేరుకుంది. శుక్రవారం చమురు ధరలు 7శాతం పెరిగిన తర్వాత ఈ పెరుగుదల నమోదైంది.

హార్ముజ్ ప్రాముఖ్యం ఏంటి?
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య హార్ముజ్ జలసంధి ఉంది. ఇరాన్, ఒమన్ సముద్ర సరిహద్దు మధ్యలో ఈ జలసంధి ఉంటుంది. ఇది ఒక ఇరుకైన జలమార్గం. ఒక చోట కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో ఐదోవంతు ఈ జలమార్గం ద్వారానే సరఫరా అవుతోందంటే ఇది ఎంత ముఖ్యమైందో అర్థమవుతుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాన్ దేశాల నుంచి ఈ జలసంధి ద్వారా ముడిచమురు ఇతర దేశాలకు ఎగుమతవుతుంది. దీంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవరూప సహజవాయువు (ఎల్ఎన్‌జీ) ఎగుమతిదారు అయిన ఖతార్ కూడా తన ఎగుమతుల కోసం ఈ జలమార్గంపైనే ఆధారపడుతుంది. ఇరాన్-ఇరాక్ యుద్ధం 1980 నుంచి 1988 వరకు కొనసాగిన సమయంలో, రెండు దేశాలు ఈ జలమార్గం ద్వారా ఒకదానికొకటి చమురు సరఫరాకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించాయి.
ట్యాంకర్ యుద్ధం’ అని కూడా పిలుస్తారు
ఈ వివాదంలో వాణిజ్య ట్యాంకర్లపై దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ ఇంధన సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సంఘర్షణను ‘ట్యాంకర్ యుద్ధం’ అని కూడా పిలుస్తారు.
హార్ముజ్ జలసంధిని మూసేస్తే ఏం జరుగుతుంది?
ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తే, ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతంపై ప్రభావం పడుతుందని నమ్ముతున్నారు. ముడి చమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్ల నుంచి 130 డాలర్ల వరకు చేరుకునే అవకాశం ఉందని.. జూన్‌లో ప్రపంచ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిని మూసేసే అవకాశం ఉండడంతో… ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలపై ప్రభావం చూపడం మొదలైందని ప్రొఫెసర్ డాక్టర్ అకాత్ లాంగర్ చెప్పారు. ‘‘మార్కెట్లు ఇప్పటికే ఈ ముప్పుకనుగుణంగా స్పందిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిని మూసేస్తే, చమురు సరఫరాకు అంతరాయం కలిగి, ధరలు పెరుగుతాయని చెప్పడం తప్పేం కాదని’’ ఆయన అన్నారు. అయితే, ఇజ్రాయెల్ దాడి తర్వాత, ఇరాన్ తన చమురు సరఫరాపై ఎటువంటి ప్రభావం పడలేదని స్పష్టం చేసింది. చమురు నిల్వ సౌకర్యాలు లేదా శుద్ధి కర్మాగారాలు లక్ష్యంగా ఈ దాడులు జరగలేదని చమురు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్రమైన దెబ్బ
కానీ వివాదం ముదిరితే.. భవిష్యత్తులో ఈ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని, దీని వలన ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్రమైన దెబ్బ తగలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా.. హార్ముజ్ జలసంధి ఇరాన్, అమెరికా మధ్య వివాదాలకు, సంఘర్షణకు కేంద్రంగా ఉంది. ఒక అమెరికన్ ఫైటర్ జెట్ 1988లో ఇరానియులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఈ జలసంధి సమీపంలో కూల్చివేసింది. ఈ దాడిలో 290 మంది మరణించారు.తమ నావికా దళం ఆ విమానాన్ని ఫైటర్ జెట్‌గా భావించి కూల్చేసిందని, ఇది సైనిక తప్పిదమని అమెరికా పేర్కొంది.
Read Also: Military Aircraft : ఏ దేశం దగ్గర ఎన్ని మిలిటరీ ఎయిర్ క్రాఫ్టులున్నాయంటే?